కెసీఆర్ అవినీతిపై ప్రచారం చేయండి
తెలంగాణలో బిజెపి మరింత దూకుడు పెంచాలని నిర్ణయించింది. బిజెపి అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మంగళవారం నాడు ఢిల్లీలో బిజెపి నేతలకు చేసిన దిశా, నిర్దేశం ఇదే అంశాన్ని నిర్ధారిస్తోంది. టీఆర్ఎస్ బియ్యం కుంభకోణంతోపాటు ఇతర అవినీతిని బహిర్గతం చేయాలన్నారు అమిత్ షా. కెసీఆర్ అవినీతి ప్రజలకు వివరంగా చెప్పాలన్నారు. అదే సమయంలో అవినీతిపై విచారణకు డిమాండ్ చేయాలన్నారు. పార్టీ కార్యక్రమాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు..ప్రభుత్వాల మధ్య జరిగేది జరుగుతూనే ఉంటుందని అమిత్ షా వ్యాఖ్యానించినట్లు బిజెపి నేతలు వెల్లడించారు. అదే సమయంలో తాను ఇక నుంచి తెలంగాణలో తరచూ పర్యటిస్తానని అమిత్ షా రాష్ట్ర నేతలకు తెలిపారు.
హుజురాబాద్ తరహాలోనే రాబోయే ఎన్నికల్లో గెలవాలని నాయకులకు పిలుపునిచ్చారు. హుజూరాబాద్ లో గెలిచిన ఈటెల రాజేందర్ ను ప్రత్యేకంగా అభినందించారు అమిత్ షా. బండి సంజయ్ ఇంతకు ముందు నిర్వహించిన పాదయాత్ర తరహాలో కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ భేటీ సందర్భంగా అమిత్ షా తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్ తో ప్రత్యేకంగా పదిహేను నిమిషాలు సమావేశం అయ్యారు. బిజెపిపై టీఆర్ఎస్ చేసే విమర్శలను బలంగా తిప్పికొట్టాలన్నారు. అమిత్ షాతో జరిగిన భేటీలో రాష్ట్రానికి చెందిన బిజెపి కీలక నేతలు అందరూ పాల్గొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితోపాటు ఎంపీ ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్, డీకె అరుణ, జితేందర్ రెడ్డి, విజయశాంతి తదితరులు పాల్గొన్నారు.