కెసిఆర్ ఆటలు ఇక సాగవు
తెలంగాణ గడ్డపై ఇక సీఎం కెసిఆర్ ఆటలు సాగవు అని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అందరం అనుకుంటే కెసిఆర్ ను గద్దె దించటం పెద్ద కష్టం కాదన్నారు.ఇందిరాపార్క్ దగ్గర అఖిలపక్షం ఆధ్వరంలో జరిగిన మహాధర్నా లో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ విముక్తి జరగాలంటే గులాబి చీడ వదిలించుకోవాలని తెలిపారు. పెట్రోల్, డీజిల్ రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. రూ.24 లక్షల కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. నల్లధనం బయటకు తెస్తానని చెప్పిన మోదీ.. ప్రతి పేద కుటుంబానికీ రూ.15 లక్షలు బాకీపడ్డారన్నారు. ప్రధాని మోడీ చాయ్ అమ్మిన రైల్వే స్టేషన్.. కాంగ్రెస్ పార్టీ కట్టిందేనని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ రైల్వే స్టేషన్‌లు కడితే.. మోదీ ప్రభుత్వం రైళ్లు అమ్ముతోందని విమర్శించారు. ప్రభుత్వ సంస్థలను రూ.6 లక్షల కోట్లకు అమ్ముతున్నారని చెప్పారు. మేము ఇద్దరం.. మాకు ఇద్దరు అనే రీతిలో దేశాన్ని పట్టి పీడిస్తున్నారని దుయ్యబట్టారు. గల్లీలోని కేడీ.. ఢిల్లీలో ఉన్న మోడీ ఇద్దరూ ఒకటే అని రేవంత్ రెడ్డి విమర్శించారు. పన్నుల రూపంలో సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ.. ప్రజల నడ్డి విరుస్తున్నారని ధ్వజమెత్తారు. హరితహారం పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం పోడు భూములను గుంజుకుంటోందని విమర్శించారు.
తెలంగాణ విముక్తి కోసం ఆఖరి పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పోడు భూముల కోసం కొట్లాట మొదలయ్యిందన్నారు. మహిళలు అని కూడా చూడకుండా డెకాయిట్ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. భూములతో పాటు తమ ప్రాణాలు కూడా తీసుకోండని గిరిజనులు ఆందోళన చేస్తున్నారని తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ.. నలుగురి చేతుల్లో బంధీ అయిందన్నారు. అన్ని పార్టీలను ఒకే గొడుగు కిందకు తెస్తున్నట్లు చెప్పారు. తాము ఎలాంటి రాజకీయాల కోసం కాకుండా.. దేశం, రాష్ట్ర సంక్షేమం కోసమే పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 27వ తేదీన తలపెట్టిన భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు 30న అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని అంబేడ్కర్ సాక్షిగా కలెక్టర్లకు వినతులు ఇవ్వనున్నట్లు చెప్పారు.