Telugu Gateway

కెటీఆర్ రాహుల్ ను లాగితే...రేవంత్ కెసీఆర్ ను లాగారు

కెటీఆర్ రాహుల్ ను లాగితే...రేవంత్ కెసీఆర్ ను లాగారు
X

డ్ర‌గ్స్, అవినీతి ఆరోప‌ణ‌లు. తెలంగాణ మంత్రి కెటీఆర్, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ల మ‌ధ్య రాజ‌కీయ వార్ ముదురుతోంది. కొద్ది రోజుల క్రితం రేవంత్ రెడ్డి గ‌జ్వేల్ స‌భ‌లో చేసిన వ్యాఖ్య‌లు పెద్ద దుమార‌మే రేపాయి. డ్ర‌గ్స్ కు కెటీఆర్ బ్రాండ్ అంబాసిడ‌ర్ అంటూ ఆయ‌న స‌భ‌లో తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. దీనిపై మంత్రి కెటీఆర్ తీవ్రంగా స్పందించారు. త‌మ‌పై నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తే రాజ‌ద్రోహం కేసులు పెడ‌తామంటూ మ‌రీ హెచ్చ‌రించారు. ఆ త‌ర్వాత రేవంత్ రెడ్డి డ్ర‌గ్స్ ప‌రీక్షల‌కు సిద్ధం కావాలంటూ మంత్రి కెటీఆర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డికి రేవంత్ వైట్ ఛాలెంజ్ అంటూ కొత్త స‌వాల్ విసిరారు. దీనిపై కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి స్పందించారు. తాను ఈ ఛాలెంజ్ స్వీక‌రించ‌టానికి సిద్ధం అన్నారు. దీనిపై మంత్రి కెటీఆర్ కూడా స్పందించారు. తాను ఢిల్లీలోని ఎయిమ్స్ లో ఏ టెస్ట్ కు అయినా సిద్ధం అని..అక్క‌డ‌కు రాహుల్ గాంధీ వ‌స్తే అంటూ ట్వీట్ చేశారు. చ‌ర్ల‌ప‌ల్లి జైలుకు వెళ్ళివ‌చ్చిన వారితో జ‌త చేర‌టం త‌న గౌర‌వాన్ని త‌గ్గించుకున్న‌ట్లు అవుతుంద‌ని అన్నారు.

తాను టెస్ట్ చేయించుకుంటే క్లీన్ చిట్ వ‌స్తుంద‌ని..అప్పుడు క్షమాప‌ణ చెప్పి, నీ ప‌ద‌వులకు రాజీనామా చేస్తావా అని కెటీఆర్ ప్ర‌శ్నించారు. కెటీఆర్ ట్వీట్ పై రేవంత్ రెడ్డి స్పందించారు. సీఎం కెసీఆర్ తో క‌ల‌సి లై డిటెక్ట‌ర్ ప‌రీక్షల‌కు తాను సిద్ధం అన్నారు. సీబీఐ కేసులు, స‌హ‌రా పీఎఫ్ అక్ర‌మాల‌పై ప‌రీక్షల‌కు కెసీఆర్ సిద్ధ‌మా అని ప్ర‌శ్నించారు. అయితే ఈ వ్య‌వ‌హారంపై కెటీఆర్ మ‌రో ట్వీట్ చేస్తూ తాను త‌న‌పై జ‌రుగుతున్న దుష్ప్ర‌చారంపై న్యాయ‌ప‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకునేందుకు రెడీ అయిన‌ట్లు తెలిపారు. ప‌రువు న‌ష్టం కేసుతోపాటు ఇంజెక్షన్ ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోర్టును ఆశ్ర‌యించ‌నున్న‌ట్లు తెలిపారు. త‌ప్పుచేసిన వారిపై కోర్టు స‌రైన చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

Next Story
Share it