నిరుద్యోగ జంగ్ ర్యాలీకి పోలీసులు నో.. రేవంత్ ఇంటి దగ్గర ఉద్రిక్తత
కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన నిరుద్యోగ జంగ్ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తన నివాసం నుంచి బయలుదేరేందుకు సిద్ధంకాగా..పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు..కార్యకర్తల మధ్య ఒకింత తోపులాట జరిగింది. వందల సంఖ్యలో పోలీసులు ఆయన నివాసం వద్ద మోహరించారు. అదే సమయంలో ఈ ర్యాలీలో పాల్గొనేందుకు వస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటూ అరెస్ట్ లు చేస్తున్నారు. దీంతో పోలీసులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. తనను హౌస్ అరెస్ట్ చేస్తుంటే దీనికి సంబంధించి ఆర్డర్ కాపీ చూపించాలని రేవంత్ పోలీసు అధికారులను కోరారు. తెలంగాణ కోసం అమరుడైన శ్రీకాంతాచారికి నివాళులు అర్పించటానికి కూడా సీఎం కెసీఆర్, కెటీఆర్ అనుమతి కావాలా అంటూ ప్రశ్నించారు. శాంతియుతంగా తాము నిరుద్యోగ జంగ్ ర్యాలీ చేస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. గాంధీ జయంతి రోజు ఓ ఎంపీగా తన నియోజకవర్గంలో పర్యటించటానికి అడ్డంకులు కల్పించటం ఏమిటని ప్రశ్నించారు. శ్రీకాంతాచారి విగ్రహానికి నమస్కారం పెట్టడానికి వెళుతుంటే కెసీఆర్, కెటీఆర్ ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. పోలీసులు రేవంత్ ను ఆయన నివాసం వద్దే అడ్డుకోవటంతో అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ నిరుద్యోగ జంగ్ ర్యాలీని పురస్కరించకుని దిల్ షుక్ నగర్ ప్రాంతాల్లో పోలీసులు షాప్ లను మూసివేయించారు.
తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగ యువతను సీఎం కెసీఆర్ మోసం చేశారని విమర్శించారు. ఇవాళ మీరు అడ్డుకోవచ్చు..65 రోజులు ఈ కార్యక్రమం చేపట్టాం. గాంధీ జయంతి రోజు కాబట్టి ఈ కార్యక్రమం ప్రశాంతంగా నిరసన చేపట్టాం. ఇక ప్రతిరోజు ఇలాగే ఉంటుందని అనుకోకు కెసీఆర్, కెటీఆర్ అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కెసీఆర్ తెలంగాణ పోలిమేరలు దాటేలా తరిమికొట్టే రోజు వస్తుందని హెచ్చరించారు. ఉద్యమస్పూర్తిని కెసీఆర్ మంటలో కలిపారన్నారు. అహంకారపూరిత, అవినీతి పాలన అందించటమే కాకుండా..ప్రజల హక్కులను కాలరాస్తున్నారు. 1.95 లక్షల ఉద్యోగాలు ఏడున్నర సంవత్సరాల నుంచి ఖాళీలను భర్తీ చేస్తానని ఊరిస్తూ నిరుద్యోగ యువతను నిరాశకు గురిచేశారు. కెసీఆర్ నిర్ల్యక్ష్యం వల్ల పేద, మైనారిటీ, బడుగు బలహీన వర్గాల వారు అన్యాయానికి గురయ్యారన్నారు.