Telugu Gateway
Politics

రేవంత్ రెడ్డిని తెలంగాణాలో తిర‌గ‌నివ్వ‌రా?!

రేవంత్ రెడ్డిని తెలంగాణాలో తిర‌గ‌నివ్వ‌రా?!
X

ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మం కోసం ఎర్ర‌వెల్లి ఫాంహౌస్ వైపు వెళుతుంటే టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు ఇటీవ‌ల అడ్డుకున్న విష‌యం తెలిసిందే. తొలుత హౌస్ అరెస్ట్ చేశారు..బ‌య‌ట‌కు రాగానే అరెస్ట్ చేసి స్టేష‌న్ కు త‌ర‌లించారు. ఎర్ర‌వెల్లిలో అంటే అక్క‌డ ముఖ్య‌మంత్రి కెసీఆర్ ఫాంహౌస్ ఉంటుంది...సున్నిత‌మైన ప్రాంతం కాబ‌ట్టి పోలీసుల చ‌ర్య‌ను ఒకింత అర్ధం చేసుకోవ‌చ్చు. తెలంగాణ‌లో రైతుల‌ను వ‌రి వేయ‌వ‌ద్ద‌ని చెప్పిన సీఎం కెసీఆర్ త‌న ఫాంహౌస్ లో మాత్రం 150 ఎక‌రాల్లో వ‌రి వేశారంటూ రేవంత్ రెడ్డి సంచ‌ల‌న విష‌యాల‌ను బ‌హిర్గ‌తం చేశారు. త‌ర్వాత మంత్రులు సీఎం కెసీఆర్ వ‌రి వేస్తే త‌ప్పేంటి అని ప్ర‌శ్నించారు. ఇది అంతా పాత‌ క‌థ‌. అయితే శుక్ర‌వారం నాడు కూడా రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవ‌టం రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రేవంత్ రెడ్డిని అస‌లు తెలంగాణ‌లో తిర‌గ‌నివ్వ‌రా? అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. అందుకే కాబోలు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, మ‌ల్లు ర‌వి కూడా కాంగ్రెస్ శ్రేణులు కూడా టీఆర్ఎస్ మంత్రులు...ఎమ్మెల్యేల ప‌ర్య‌ట‌న‌ల‌ను అడ్డుకోవాల‌ని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి శుక్ర‌వారం నాడు భూపాల‌ప‌ల్లి రైతుల‌తో స‌మావేశం కావాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీంతో ఆయ‌న నివాసాన్ని పోలీసులు భారీ ఎత్తున చుట్టుముట్టారు.

అంతే కాదు..కొంత మంది పోలీసులు ఆయ‌న నివాసం ఉన్న ఇంట్లోకి వెళ్ళారంటూ ఈ ఘ‌ట‌న‌పై రేవంత్ రెడ్డి పోలీసు అధికారుల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గ‌త కొన్ని రోజులుగా తెలంగాణ‌లో సాగుతున్న ప‌రిణామాలు చూస్తుంటే అనూహ్యంగా ఉంటున్నాయి. బిజెపి నేత‌లు సైతం గ్రామాల్లోకి వ‌స్తే అడ్డుకోవాలంటూ అధికార టీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప‌ర్య‌ట‌న‌ల‌ను కూడా వ‌ర‌స పెట్టి అడ్డుకుంటున్నారు. ఇవ‌న్నీ చూస్తుంటే అధికార పార్టీకి ఎక్క‌డో ఏదో తేడా కొడుతున్న‌ట్లు క‌న్పిస్తోంద‌ని ఓ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి కూడా తాజా ప‌రిణామాల‌పై ఘాటుగా స్పందించారు. మంత్రి కేటీఆర్‌ ఎక్కడ కనబడితే అక్కడ సన్మానం చేయాలన్నారు. ''పోలీసుల ముళ్లకంచెలు మమ్మల్ని అపలేవని...మాకు తిక్కరేగితే జైల్‌భరోకు పిలుపునిస్తాం'' అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

Next Story
Share it