Telugu Gateway
Politics

ఓటు కు పదివేలు ఇచ్చి గెలిచేందుకు కెసిఆర్ ప్లాన్

ఓటు కు పదివేలు ఇచ్చి గెలిచేందుకు కెసిఆర్ ప్లాన్
X

కామారెడ్డి లో శనివారం నాడు ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అధికార బిఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. కామారెడ్డిలో రూ.200 కోట్లు ఖర్చు పెట్టి... రూ.2000 కోట్ల భూములను గుంజుకోవాలని కేసీఆర్ చూస్తున్నాడు రేవంత్ రెడ్డి విమర్శించారు. కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని రాజంపేటలో జరిగిన విజయభేరి జనసభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఓటుకు పది వేలు ఇచ్చి గెలవాలని కేసీఆర్ చూస్తున్నారు అని ఆరోపించారు. కామారెడ్డి భవిష్యత్తును మార్చే ఎన్నికల్లో తెలంగాణను దోచుకున్న కేసీఆర్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. రైతుల భూములను కాపాడేందుకే తాను కామారెడ్డిలో పోటీ చెస్తున్నా అని రేవంత్ రెడ్డి అన్నారు. రైతుల భూములను మింగేందుకే కేసీఆర్ కామారెడ్డికి వచ్చాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మన భూములు మన చేతిలో ఉండాలంటే ఈ ఎన్నికల్లో కేసీఆర్ ను బండకేసి కొట్టాలని అన్నారు. కేసీఆర్ కు ఓటు వేస్తే పాముకు పాలు పోసి పెంచినట్లే... కేసీఆర్ కాలనాగులాంటి వారు. కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్ వీధి కుక్కలా... ఆయన కొడుకు ఒక పిచ్చి కుక్కలా మారారని మండిపడ్డారు.గల్ఫ్ కార్మికుల కుటుంబాలు, బీడీ కార్మికులు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారు.

పదేళ్లుగా అధికారంలో ఉన్న గల్ఫ్ కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. గల్ఫ్ కార్మికుల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేయలేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను కేసీఆర్ భర్తీ చేయలేదు.. నిరుద్యోగ సమస్యను తీర్చలేదని ఆరోపించారు. రాష్ట్రంలో మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో రూ.400గా ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.1200కు చేరుకుందన్నారు. అధికారంలోకి రాగానే రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. తాము అధికారంలోకి రాగానే రైతులకు, కౌలు రైతులకు ఏటా ఎకరాకు రూ.15 వేలు, ఉపాధి హామీ పనికి వెళ్లే ప్రతి ఒక్కరికి రూ.12 వేలు, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

కేసీఆర్ కు 40 ఏళ్లుగా గుర్తుకు రాని కోనాపూర్ ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. “తెలంగాణలో 40 ఏళ్లుగా వివిధ పదవుల్లో ఉన్న కేసీఆర్ కు కొనాపూర్ గుర్తుకు రాలేదు.. కానీ ఓట్ల కోసం కొనాపూర్ బిడ్డనంటూ ఇక్కడికి వస్తుండు..ఇక్కడి రైతుల గుండెలు ఆగినపుడు ఈ ప్రాంతం గుర్తుకు రాలేదా?” అని ప్రశ్నించారు. బిక్నూరులో జరిగిన విజయభేరి జనసభలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. నాడు రైతుల కోసం కల్లాల్లోకి కాంగ్రెస్ అంటూ బిక్నూర్ కు వచ్చి మీ కోసం కొట్లాడా అని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. వడగండ్ల వానపడితే కేసీఆర్ రాలేదు... రైతు గుండె ఆగి చనిపోతే చూడనీకి రాలేదని విమర్శించారు. మాచారెడ్డి రైతు లింబయ్య సచివాలయం ముందు ఉరేసుకుని చనిపోతే కేసీఆర్ ఆదుకోలేదు..కానీ కాంగ్రెస్ లక్ష రూపాయలు ఇచ్చి లింబయ్య కుటుంబానికి భరోసా ఇచ్చిందన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఇక్కడకు రాని కేసీఆర్... ఇవాళ సిగ్గులేకుండా ఓట్లు అడగడానికి వస్తుండు అని విమర్శించారు.

“గజ్వేల్ లో కేసీఆర్, సిద్దిపేటను హరీష్, సిరిసిల్లను కేటీఆర్ ఊడ్చేశిన్రు...అక్కడ దోచుకునేందుకు ఏమీ లేక కేసీఆర్ కన్ను కామరెడ్డిపై పడింది.. కామారెడ్డి రైతుల కామారెడ్డి భూములను మింగేందుకు వచ్చిన అనకొండను వేటాడేందుకే ఇక్కడికి వచ్చా భూములు కాపాడేందుకే నేను ఇక్కడ పోటీకి దిగా” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.బిక్నూరులో ముదిరాజు బిడ్డలకు ఎక్కువగా ఉంటారు. కానీ ముదిరాజులకు సీట్లు ఇవ్వని కేసీఆర్ కు వాళ్ల ఓట్లు కావాలా అని రేవంత్ రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి పిచ్చి కుక్క అని కేసీఆర్ అంటుండు... పిచ్చి కుక్క ఎవరో ప్రజలే నిర్ణయిస్తారు..కేటీఆర్ పిచ్చి కుక్కలా కనిపించిన వారినల్లా కరుస్తుండు అని విమర్శించారు. ఓటుకు పదివేలు పంచి బిఆర్ఎస్ గెలవాలని చూస్తోంది..కామారెడ్డి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.ఈ వీధి కుక్కను, ఆ పిచ్చి కుక్కను పొలిమేరలకు తరమాలి అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామన్నారు. గల్ఫ్ సంక్షేమ నిధి ద్వారా గల్ఫ్ కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.




Next Story
Share it