Telugu Gateway
Politics

కెసీఆర్ చేసిన అవ‌మానాల‌ను ద‌ళితులు మ‌ర్చిపోతారా?

కెసీఆర్ చేసిన అవ‌మానాల‌ను ద‌ళితులు మ‌ర్చిపోతారా?
X

ఎన్నిక‌లు వ‌స్తేనే ముఖ్య‌మంత్రి కెసీఆర్ బ‌య‌ట‌కు వ‌స్తార‌ని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ద‌ళితుల‌కు కెసీఆర్ చేసిన అవ‌మానాలు అన్నీ ఇన్నీ కావ‌న్నారు. ఇప్పుడు ఉప ఎన్నిక కోస‌మే ద‌ళిత జ‌పం చేస్తున్నార‌ని ఆరోపించారు. గ‌తంలో తెలంగాణ‌కు వ‌చ్చిన ప్ర‌తిసారి అప్ప‌టి రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి, అప్ప‌టి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ కు ప‌దే ప‌దే కాళ్ల‌పై ప‌డి న‌మ‌స్కారాలు పెట్టిన సీఎం కెసీఆర్ ద‌ళిత బిడ్డ‌..రాష్ట్ర ప‌తి రామ్ నాధ్ కోవింద్ రాష్ట్రానికి వ‌చ్చిన‌ప్పుడు అలా ఎందుకు న‌మ‌స్క‌రించ‌లేద‌ని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రామ్ నాధ్ కోవింద్ కు క‌నీసం న‌మ‌స్కారం కూడా పెట్ట‌లేద‌ని విమ‌ర్శించారు. ఇదేనా ద‌ళితులకు నువ్వు ఇచ్చే గౌరవం అంటూ నిల‌దీశారు. తెలంగాణ తొలి సీఎస్ రాజీవ్ శ‌ర్మ‌కు, తొలి డీజీపీ అనురాగ్ శ‌ర్మ‌కు, ఎస్ కె జోషికి కీల‌క పోస్టులు..ఆ త‌ర్వాత స‌ల‌హాదారుల ప‌ద‌వులు ఇచ్చార‌న్నారు. కానీ నిజాయ‌తీప‌రుడు అయిన ప్ర‌దీప్ చంద్ర‌ను మాత్రం కేవ‌లం నెల అంటే నెల రోజులే సీఎస్ గా ఉంచార‌న్నారు. ఇప్పుడు ఏదో రాహుల్ బొజ్జా ను సీఎంవోలో తీసుకుని ఎవ‌రి చెవిలో పువ్వులు పెడ‌తార‌న్నారు. అమ‌రుల త్యాగాల‌తో వ‌చ్చిన తెలంగాణ‌లో అన్నీ అనుభవిస్తున్న‌ది కెసీఆర్ కుటుంబ‌మే అని..మ‌రి అమ‌ర‌వీరుల‌కు ద‌క్కింది ఏమిట‌ని ప్ర‌శ్నించారు. ఐఏఎస్‌ మురళిని అవమానించావ్, ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌ను అవమానిస్తే ఆయన ఐపీఎస్‌ పదవికి రాజీనామాచేశారు.

దళిత ఓట్ల కోసమే దళిత బంధు పెట్టాడు. రేపు జరగబోయే హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌కు బొంద పెడతారు అని రేవంత్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.హైదరాబాద్‌ శివారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిర్యాలలో కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హించిన 'దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోర సభలో రేవంత్ మాట్లాడారు. ద‌ళితుల‌కు కెసీఆర్ చేసిన మోసాలు ప్ర‌జ‌లు మ‌ర్చిపోయినా కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు ప్ర‌తి చోటా ఈ అంశాల‌ను ప్ర‌స్తావిస్తార‌న్నారు. ఎన్నిక‌లు ఉంటేనే కెసీఆర్ బ‌య‌ట‌కు వ‌స్తార‌ని..ఈ సారి కెసీఆర్ ను వ‌దిలిపెట్ట‌కూడ‌ద‌న్నారు. కెసీఆర్ త‌నను ఐఏఎస్ చేయాల‌నున్నార‌ని..త‌న‌కు తెలియ‌కుండా తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చానంటూ మంత్రి కెటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పైనా మండిప‌డ్డారు. మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్‌కు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఇచ్చి పేద విద్యార్థులకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. మ‌రో 18 నెల‌ల్లో సీఎం కెసీఆర్ ను గ‌ద్దె దించాల‌న్నారు.మ‌ళ్ళీ మ‌ళ్ళీ మ‌న‌కు ఇలాంటి ఛాన్స్ లు రావ‌ని..వాటిని వ‌దులుకోవ‌ద‌న్నారు. కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు కెసీఆర్ ను ఇంటికి పంపేందుకు రెడీ కావాల‌న్నారు.

Next Story
Share it