కెసీఆర్..తెలంగాణ ఆత్మగౌరవాన్ని బీహారీలకు తాకట్టుపెడతావా?
తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కెసీఆర్ పై నమ్మకం పోయిందని..అందుకే ఆయన ఇప్పుడు బీహార్ కు చెందిన ప్రశాంత్ కిషోర్ ను తెచ్చుకున్నారని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కెసీఆర్ నీ అసలు రంగు బయట పడింది..వంద మంది ప్రశాంత్ కిషోర్ లు..వెయ్యి మంది ప్రకాష్ రాజ్ లు వచ్చినా నువు ఇక తెలంగాణలో గెలవలేవు అంటూ వ్యాఖ్యానించారు. నువ్వు నక్కజిత్తుల వాడివి అని ప్రజలు గుర్తించారన్నారు. ఎప్పుడెప్పుడు వంద మీటర్ల గోతిలో పాతిపెట్టాలని చూస్తున్నారని అన్నారు. బీహారీ ముఠాలతో బెదిరించే..భయపెట్టి మూడవ సారి కూడా అధికారాన్ని దక్కించుకోవాలని చూస్తున్నారని..ప్రజలు అంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో పరిపాలన చేయటానికి రాష్ట్రానికి చెందిన బిడ్డలు పనికిరారా అని ప్రశ్నించారు. సోమేష్ కుమార్, అరవింద్ కుమార్, సందీప్ కుమార్, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లతో ఓ బీహారీ ముఠాలతో తెలంగాణపై దాడి చేయటానికి రెడీ అయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని బీహారీల వద్ద తాకట్టుపెడతారా?. ఈ రాష్ట్రానికి ఒక్క తెలంగాణ ఐఏఎస్ బిడ్డలేడా? అని ప్రశ్నించారు. మాట్లాడితే టీఆర్ఎస్ నేతలు నదులకు నడక నేర్పింది కెసీఆర్. ప్రాజెక్టులకు రీడిజైన్ చేసింది కెసీఆర్. కెజీటూ పీజీ ఉచిత నిర్బంద విద్య ఆలోచన కెసీఆర్ దే. రైతు బంధు పథకం కెసీఆర్ దే. మీకు ఎన్నడైనా ఆలోచన వచ్చిందా.
ఆయనే ఇంజనీర్, ఆయనే సైంటిస్ట్..ఆయనే అన్నీ. చంద్రమండలానికి కూడా ప్రెసిడెంట్ అయితే అక్కడ కూడా డెవలప్ చేస్తాడు అని చెప్పుకనే సన్నాసులారా..సంకనాక ప్రశాంత్ కిషోర్ ను తెచ్చుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఎంతమంది ప్రశాంత్‌కిషోర్ లాంటి వ్యక్తులను తెచ్చుకున్నా సీఎం కేసీఆర్ గెలవలేరని తేల్చిచెప్పారు. సోమవారం ఆయన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మాట్లాడుతూ కేసీఆర్ కుట్రలకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కేసీఆర్ కుట్రలను మేధావులు ఆలోచించాలని సూచించారు. రాష్ట్రం కోసం అనేకమంది తెలంగాణ బిడ్డలు అమరులయ్యారని తెలిపారు. కేసీఆర్ ఏపీ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై వేలకోట్లు సంపాదించారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మెగా క్రిష్ణారెడ్డి దేశంలోని సంపన్నుల్లో ఒకరు అయ్యారని అన్నారు. ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారే వారికే పదవులు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పథకాల్లో కాంగ్రెస్ కార్యకర్తలకే తొలి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.