కల్తీమందు తాగివచ్చినట్లు కెసీఆర్ మాట్లాడారు
బిజెపి కుట్రలో భాగంగానే కెసీఆర్ కొత్త రాజ్యాంగ ప్రతిపాదన
ముఖ్యమంత్రి కెసీఆర్ పై టీపీసీసీ ప్రెసిడెంట్, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దళిత, అణగారిన వర్గాలకు ఆశాజ్యోతిగా ఉన్న అంబేద్కర్ రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న కేసీఆర్ ప్రకటన వెనుక బీజేపీ కుట్ర ఉందని ఆరోపించారు. బుధవారం నాడు రేవంత్ ఢిల్లీలో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, దళిత, మైనారిటీ వర్గాలకు రాజ్యాంగంలో రిజర్వేషన్లతో పాటు రక్షణ ఉందని... అందుకే ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ ఎప్పటి నుంచో కుట్ర పన్నుతోందని... ఇపుడు బీజేపీ ఒత్తిడితోనే కేసీఆర్ కొత్త రాజ్యాంగం అనే ప్రతిపాదన తెస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మన అవసరాలకు అనుగుణంగా, మారిన పరిస్థితులకు అనుగుణంగా సవరించుకునే అవకాశమున్నా... రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ వాదన... బీజేపీలో కుట్రలో భాగమే అని రేవంత్ రెడ్డి అన్నారు. బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులు లేకపోవడంపై మోడీతో పోరాటం చేయాల్సిన కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలన వాదన తేవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశంలోని పది శాతం మంది శ్రీమంతుల కోసమేనని ఆయన విమర్శించారు. కేంద్ర బడ్జెట్ గంటన్నర ఉంటే కేసీఆర్ రెండున్నర గంటలు ఏక పాత్రాభినయం చేశారని ఎద్దేవా చేశారు. కల్తీ మందు తాగి వచ్చినట్లు మాట్లాడారని వ్యాఖ్యానించారు. విభజన చట్టం అంశాలు, కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, ఎన్టీపీసీ యూనిట్, రైల్వే లైన్లు, జాతీయ రహదారుల విషయం ఏదీ మాట్లాడలేదన్నారు. మోడీపై యుద్ధం ప్రకటిస్తారని ఆశించినట్లు తెలిపారు. అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహం ముందు కేసీఆర్ దిష్టి బొమ్మలు దగ్దం చేయాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ రాజ్యాంగం రద్దు ఆలోచనను ఉపసంహరించుకునేందుకు రెండు రోజుల పాటు గాంధీ భవన్లో నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. రాజ్యాంగం రద్దు ఆలోచనను ఉపసంహరించుకొకపోతే దేశ యువత కేసీఆర్ నాలుక కొస్తారని రేవంత్ హెచ్చరించారు. యూపీలో బీజేపీని గెలిపించాలన్న ఆలోచన కేసీఆర్ చేస్తున్నారన్నారు. కేసీఆర్ అసదుద్దీన్ ఒవైసీ సుపారి గ్యాంగ్ అని వ్యాఖ్యానించారు. యూపీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడానికి సుపారి తీసుకున్నారని తెలిపారు. ఓట్లు చీల్చడానికి ఎంఐఎం పోటీ చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అసభ్యకరమైన భాష మాట్లాడారని విమర్శించారు. కేసీఆర్ భాషను ఖండిస్తున్నామన్నారు. సిద్ధాంత పరంగా బీజేపీని వ్యతిరేసిస్తాం కానీ... కేసీఆర్ భాషను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ప్రధాన మంత్రిని ఉద్దేశించి ముఖ్యమంత్రి అసభ్యంగా మాట్లాడితే తెలంగాణ పరువు ఏమి కావాలని ఆయన ప్రశ్నించారు. మహిళలను గౌరవించే సంస్కృతి భారత సంస్కృతి అని చెప్పుకొచ్చారు. కేసీఆర్ భాషను సభ్య సమాజం క్షమించదన్నారు. కేసీఆర్ భాష ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు మేలు చేసేది కాంగ్రెస్ పార్టీనే అని స్పష్టం చేశారు. విభజన హామీలు అమలు కావాలంటే కాంగ్రెస్తోనే అని రేవంత్ తెలిపారు.