Telugu Gateway
Politics

మోడీ దేశ భ‌క్తుడైతే ఆ చైనా విగ్ర‌హాన్ని ఆవిష్క‌రిస్తారా?

మోడీ దేశ భ‌క్తుడైతే ఆ చైనా విగ్ర‌హాన్ని ఆవిష్క‌రిస్తారా?
X

పంపింది కెసీఆర్..ఆమోదించింది మోడీ స‌ర్కారు..మ‌రి 317 జీవోపై ఈ డ్రామా ఏంటి?

టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి

తెలంగాణ ఉద్యోగుల్లో క‌ల‌క‌లం రేపిన జీవో 317 అంశంపై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జోన‌ల్ వ్య‌వ‌స్థ‌కు సంబంధించి ముఖ్య‌మంత్రి కెసీఆర్ కేంద్రానికి ప్ర‌తిపాద‌న‌లు పంపితే..వాటిని ఆమోదించింది కేంద్రంలోని మోడీ స‌ర్కారు అని రేవంత్ తెలిపారు. మ‌రి జీవో 317లో త‌ప్పులు ఉంటే ..ఆ త‌ప్పులను ఆమోదించింది ఎవ‌రు? అని ప్ర‌శ్నించారు. అవి రాష్ట్ర‌ప‌తి ఉత్త‌ర్వుల‌కు విరుద్ధంగా ఉంటే కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, బిజెపి ఎంపీలు ఫిర్యాదు చేసి మార్పులు చేయించ‌వ‌చ్చు క‌దా? అని ప్ర‌శ్నించారు. కెసీఆర్ ఈ జీవో అమ‌లు చేస్తున్నారంటే అది బిజెపి ప్రోద్భ‌లంతోనే అన్నారు. కానీ ఇద్ద‌రూ క‌ల‌సి తెలంగాణ‌లో నిరుద్యోగ యువ‌త‌, ఉద్యోగుల‌ను త‌ప్పుదారి ప‌ట్టిస్తున్నార‌ని మండిప‌డ్డారు. రేవంత్ రెడ్డి సోమ‌వారం నాడు గాంధీ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. బండి సంజ‌య్ పార్టీ కార్యాల‌యంలో దీక్షకు కూర్చుంటే టీఆర్ఎస్ కు ఉన్న అభ్యంత‌రం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. బండి సంజ‌య్ ఏమి పోరాటం చేశార‌ని..బిజెపి ముఖ్య‌మంత్రులు తెలంగాణ‌కు వ‌చ్చి హంగాగా చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. అస‌లు ఇలాంటి ప‌నులు చేయ‌టానికి బిజెపి నేత‌ల‌కు సిగ్గూ,శ‌రం ఉందా అని మండిప‌డ్డారు. చైనాలో తయారైన రామనుజాచార్యుల విగ్రహావిష్కరణకు రావద్దని, అలా వస్తే మీరు దేశద్రోహులే అవుతారని ప్రధాని మోడీని ఉద్దేశించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మోడీ ఎజెండాను కేసీఆర్ అమలు చేస్తున్నారని ఆయన ఆరో్పిచించారు.

బండి సంజయ్, మోడీ దేశభక్తి నేతి బీరకాయలో నేతి అంత అని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు మేక్ ఇన్ ఇండియా అని గొప్పలు చెబుతారని, గుజరాత్‌లో పెట్టిన సర్దార్ పటేల్ విగ్రహాన్ని చైనాలో ఎందుకు తయారు చేయించారని ఆయన ప్రశ్నించారు.ముచ్చింతలలో పెట్టబోయే రామానుజాచారి విగ్రహం కూడా చైనాలోనే తయారైందని ఆయన తెలిపారు. చైనాలో తయారైన ఆ విగ్రహ ఆవిష్కరణకు మోడీ ఎలా వస్తారని ఆయన ప్రశ్నించారు. అటువంటపుడు మీరు ఎలా దేశభక్తులు అవుతారన్నారు. ఓ 50 చైనా యాప్ ల‌ను నిషేధించి తామే అస‌లైన దేశ భ‌క్తులం అని చెప్పుకున్న మోడీ..చైనాలో త‌యారైన విగ్ర‌హాన్ని ఎలా ఆవిష్క‌రిస్తార‌ని ప్ర‌శ్నించారు. ముచ్చింతాల‌లో విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు ప్ర‌ధాని మోడీ, ఇత‌ర విఐపిలు వ‌స్తే దీనిపై స‌మీక్ష స‌చివాల‌యంలో జ‌రగాలి కానీ..రామేశ్వ‌ర‌రావు ద‌గ్గ‌ర‌కు కెసీఆర్, కేబినెట్, సీఎస్ వెళ్ళ‌టం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. ఇంత కంటే సిగ్గుమాలిన ప‌ని మ‌రొక‌టి ఉంటుందా అని ప్ర‌శ్నించారు. సీఎం కెసీఆర్ కు నిజంగా బిజెపితో ఎలాంటి లోపాయికారీ ఒప్పందాలు లేక‌పోతే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని ఓడించాల‌ని పిలుపునివ్వ‌టంతో..ఆ పార్టీకి వ్య‌తిరేకంగా ప్ర‌చారం నిర్వ‌హించాల‌ని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Next Story
Share it