Telugu Gateway
Politics

ఇది రావుల రాజ్యం..దళిత,గిరిజ‌నుల‌కు ఏమీ రావు

ఇది రావుల రాజ్యం..దళిత,గిరిజ‌నుల‌కు ఏమీ రావు
X

కెసీఆర్ కు రాసుకోవ‌టానికి పేప‌ర్..చూసుకోవ‌టానికి టీవీ వ‌చ్చాయి

అంతే త‌ప్ప ద‌ళితులు..గిరిజ‌నుల‌కు వ‌చ్చిందేమీలేదు

టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి స‌మావేశం వేదిక‌గా ముఖ్య‌మంత్రి కెసీఆర్ పైతీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణ‌లో ప్ర‌స్తుతం రావుల రాజ్యం ఉంద‌ని..ద‌ళిత‌, గిరిజ‌నుల‌కు ఏమీ రావ‌న్నారు. ద‌ళిత‌, బ‌డుగుల రాజ్యం వ‌స్తేనే వారికి మేలు జ‌రుగుతుంద‌న్నారు. అది ఎవ‌రూ ఇవ్వ‌రు. మ‌న‌మే తెచ్చుకోవాల‌ని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వ‌స్తే తొలి ముఖ్య‌మంత్రి ద‌ళితుడే అవుతాడ‌ని చెప్పార‌ని..మ‌రి ఇప్పుడు ద‌ళితుడు ఉన్నాడా..ద‌రిద్రుడు ఉన్నాడా అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఉన్న ఉప ముఖ్య‌మంత్రిని కూడా పంచెక‌ట్టుకున్నాడని అవినీతి ఆరోప‌ణ‌ల‌తో తీసివేశార‌న్నారు. ఆ అవినీతి ఏంటో ఇప్ప‌టికి కూడా చెప్ప‌లేద‌న్నారు. నిన్న‌టి నుంచి ఒక లెక్క‌...ఇవాళ్టి నుంచి ఒక లెక్క కెసీఆర్ నిన్ను బొంద పెడ‌తా అంటూ హెచ్చ‌రించారు. ఎవ‌రూ చేయ‌ని రీతిలో నాలుగు ల‌క్షల కోట్ల రూపాయ‌లు అప్పు చేసిన కెసీఆర్ ప్ర‌జ‌ల నెత్తిన భారం మోపార‌న్నారు. ఈ డ‌బ్బు అంతా క‌మిష‌న్లు..కాంట్రాక్ట‌ర్ల చేతుల్లోకి పోయింద‌ని ఆరోపించారు. ఇంకా కెసీఆర్ ఫాంహౌస్ లో విశ్రాంతి తీసుకోవ‌టానికి 20 నెల‌లే స‌మ‌యం ఉంద‌ని..ఆ త‌ర్వాత ఎక్క‌డ ఉన్నా చ‌ర్ల‌ప‌ల్లి జైలులో సేద‌తీరాల్సిందేన‌ని వ్యాఖ్యానించారు. ఈ ప్ర‌భుత్వంలో సాగుతున్న అవినీతి, అక్ర‌మాలు, దోపిడీ ప్ర‌తిదీ డైరీలో నోట్ చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. తెలంగాణ వ‌చ్చాక ఏమి వ‌చ్చింద‌ని అంటే కెసీఆర్ కుటుంబానికి చూపించుకోవ‌టానికి టీవీ వ‌చ్చింది..రాసుకోవ‌టానికి పేప‌ర్ వ‌చ్చింద‌ని ఎద్దేవా చేశారు. కెసీఆర్ సీఎం ప‌ద‌విలో ఉండి త‌మ కుటుంబ స‌భ్యులు అంద‌రినీ టాటా, బిర్లా, అంబానీలుగా మార్చార‌ని వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే కెసీఆర్ కు సీఎం ప‌ద‌వి వచ్చింది. కొడుకు కు మంత్రి ప‌ద‌వి,,కూతురుకి ఎంపీ ప‌దవి...ఓడిపోతే ఎమ్మెల్సీ . సారాలో సోడా పోసిన ష‌డ్డ‌కుడు కొడుకుకు రాజ్య‌స‌భ సీటు వ‌చ్చింది. అల్లుడుకి మంత్రి ప‌ద‌వి ఇచ్చాడు అంటూ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీనే ద‌ళితులు, గిరిజ‌నుల‌కు న్యాయం చేసింద‌ని రేవంత్ రెడ్డి తెలిపారు.

మ‌ళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తేనే వారికి మేలు జ‌రుగుతుంద‌న్నారు. దళితుడికి రాష్ట్రపతి పదవి ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని తెలిపారు. లోక్‌సభ స్పీకర్‌గా మీరాకుమార్‌ను చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని చెప్పారు. రిజర్వేషన్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్‌ పార్టీనేనని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. ఉపఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్‌కు దళితులు గుర్తుకు వచ్చారని, కేసీఆర్ మంత్రివర్గంలో మాదిగలకు స్థానమే లేదని విమర్శించారు. చివరి రక్తపు బొట్టు వరకు ప్రజలకు తోడు, నీడగా ఉంటానని రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. సమైక్యపాలనలో అడవి బిడ్డలను కాల్చేస్తుంటే... ఈ ప్రాంత నేతలు నిస్సహాయులుగా నిలిచిపోయారని ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా నేత‌ల‌పై కూడా రేవంత్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఉప ఎన్నిక‌లు వ‌స్తే కెసీఆర్ కు ద‌ళితులు, గిరిజ‌నులు గుర్తుకు రార‌ని..అందుకే 118 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉప ఎన్నిక‌లు రావాల‌న్నారు. అందుకే యువ‌త అంతా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను ఇస్త‌వా..చ‌స్త‌వా అని నిల‌దీయాల‌న్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోస‌మే దళిత బంధు త‌మ‌ది మ‌ఠం కాదు..రాజ‌కీయ పార్టీ అంటూ నిస్సిగ్గుగా మాట్లాడిన ముఖ్య‌మంత్రి ఎవ‌రూ లేర‌న్నారు. ఇంద్ర‌వెల్లి స‌భ‌కు తాను చెప్పిన‌ట్లు ల‌క్ష మంది వ‌చ్చార‌ని పోలీసులు..నిఘా, మీడియా ఈ లెక్క‌లు చూసుకోవ‌చ్చ‌న్నారు. లెక్క త‌ప్పితే తాను త‌ల‌వంచ‌టానికి కూడా సిద్ధ‌మే అన్నారు.

Next Story
Share it