కెటీఆర్ కు ఈడీ నోటీసులు ఆపారు..టీఆర్ఎస్ ఎంపీలు వెనక్కివెళ్లారు
కెసీఆర్ సన్నిహిత రియల్ సంస్థకు, సాగునీటి శాఖ కాంట్రాక్టర్లకూ ఈడీ నోటీసులు, విచారణ
రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
టీపీసీసీ ప్రెసిడెంట్, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తాజాగా ఢిల్లీలో ముఖ్యమంత్రి కెసీఆర్, మంత్రి కెటీఆర్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ కుంభకోణానికి సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కెటీఆర్ కు నోటీసులు జారీ చేయటానికి సిద్ధం అయిన తరుణంలోనే ఇరు పార్టీల మధ్య రహస్య అవగాహన కుదిరిందని తెలిపారు. రేవంత్ రెడ్డి మంగళవారం నాడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలను వెల్లడించారు. అందులోని ముఖ్యాంశాలు..'రాష్ట్రంలో..హైదరాబాద్ శివారులో మూడు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన భూ లావాదేవీల్లో కెసీఆర్ కు అత్యంత సన్నిహితమైన రియల్ ఎస్టేట్ సంస్థకు, అదే విధంగా సాగునీటి పారుదల శాఖలో పనులు చేస్తున్న సంస్థలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. విచారణకు రప్పించింది. వాళ్ల నుంచి సంపూర్ణ సమాచారం సేకరించింది. ఈ భూములు గతంలో హెచ్ ఎండీఏ ఆధ్వర్యంలో వేలంలో అమ్మారు. విదేశాలకు చెందిన ఓ సంస్థ కొనుగోలు చేసింది. స్థానిక భాగస్వాములతో టీఆర్ఎస్ ప్రభుత్వం బెదిరించి 450 కోట్లకు కొననుగోలు చేసిన దానిని 300 కోట్లకే రాయించుకున్నారు.
ఆ భూమి విలువ ఇప్పుడు 3000 వేల కోట్ల రూపాయలు . రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అత్యంత సన్నిహిత రియల్ ఎస్టేట్ సంస్థ యాజమానులే దీన్ని దక్కించుకున్నారు. ఆ నాటి టెండర్ నిబంధనల ప్రకారం ఇతర సంస్థలకు బదిలీ చేయటం నిషేధించారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. అలా కాకుండా కెటీఆర్ శాఖ ఆ సంస్థకు అన్ని అనుమతులు ఇచ్చింది. ఈ భూలావాదేవీలకు సంబంధించిన అన్ని వ్యవహారాలపై ఫిర్యాదులు అందటంతో ఈడీ విచారణ జరిపి మొత్తం కుంభకోణం జరగటం వెనక కెటీఆరే కారణం అని తేల్చారు. కెటీఆర్ కు ఈడీ నోటీసుల ఇచ్చే క్రమంలో బిజెపి, కెసీఆర్ కు మధ్య కొంత అంతరం ఏర్పడింది. వరి ధాన్యం కొనుగోలు అంశాన్నితెచ్చి ఈడీ నోటీసులను, విచారణను తప్పించుకోవటానికి కెసీఆర్, టీఆర్ఎస్ పార్టీ నాటకాలు ఆడుతున్నారు. ఈ నాటకాల పలితమే బిజెపి, టీఆర్ఎస్ మధ్య జరిగిన రహస్య చర్చల కారణంగా ఈడీ నోటీసులను తాత్కాలికంగా ఆపేశారు. కేంద్రం ఎప్పుడైతే ఈడీ నోటీసులు తాత్కాలికంగా ఆపేసిందో అప్పుడే ఎంపీలను హుటాహుటిన హైదరాబాద్ కు రప్పించారు.' అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ అంశంపై తాను నిర్ధిష్టమైన ఆరోపణ చేస్తున్నానని పేర్కొన్నారు. బిజెపి, టీఆర్ఎస్ ల అవగాహన లో భాగంగానే ఇది జరిగిందన్నారు. బిజెపికి సహకరించటానికి ఒప్పుకున్నారని తెలిపారు. యాసంగిలో ధాన్యం సేకరణ సమస్య తీరకుండానే ఎంపీలు ఎందుకు పార్లమెంట్ నుంచి బహిష్కరణ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు. ఢిల్లీని కాదని గల్లీకి వెళ్ళారు. ఢిల్లీ మీద యుద్ధం ప్రకటిస్తాం..అగ్గిపుట్టిస్తాం అని చెప్పిన మీరు ఎందుకు వెనక్కి తగ్గారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో 18 ప్రతిపక్ష పార్టీలు నల్ల రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం సమయంలో చనిపోయిన వారికి సంతాపం చెప్పాలని..వారికి నష్టపరిహారం చెల్లించాలనే అంశంపై సభలో ఉద్యమం చేస్తే ధాన్యం సేకరణ పేరుతో ధర్నాలు చేసి నరేంద్రమోడీకి టీఆర్ఎస్ ఎంపీలు సహకరించాకన్నారు. మోడీ, కెసీఆర్ ల మధ్య ఉన్న అవగాహనతోనే అంతా జరిగిందని ఆరోపించారు. బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడితే ఈడీ, ఐటీ కేసులు పెడతారని కెసీఆర్ కొద్ది రోజుల క్రితం మాట్లాడిన విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు.