Telugu Gateway
Politics

ఐఏఎస్ ల సంఘం ప్రెసిడెంట్, కార్య‌ద‌ర్శులు కూడా వాళ్ళేగా

ఐఏఎస్ ల సంఘం ప్రెసిడెంట్, కార్య‌ద‌ర్శులు కూడా వాళ్ళేగా
X

సోమేష్ కుమార్, అర‌వింద్ కుమార్ అనుమ‌తుల‌పై విచార‌ణ‌

సీఎం కెసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ‌

తెలంగాణ‌లో బీహారి అధికారుల‌కు కీల‌క ప‌ద‌వులు అప్పగించిన అంశంపై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి త‌న దాడిని కొన‌సాగిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయ‌న ఇదే అంశంపై ముఖ్య‌మంత్రి కెసీఆర్ కు బ‌హిరంగ లేఖ రాశారు. హెచ్ఎండీఏ, రేరాల్లో సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్ ఇచ్చిన అనుమతులపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. జయేశ్ రంజన్ సారథ్యంలో టీఏస్‌ఐఐసీ ద్వారా జరిగిన భూ కేటాయింపులపై విచారణ జరిపించాలని రేవంత్ త‌న లేఖలో ఆయన కోరారు. తాను చేసిన విమ‌ర్శ‌ల‌పై ప్ర‌భుత్వం స‌మాధానం చెబుతుంద‌ని భావిస్తే ఐఏఎస్ ల సంఘం ఎందుకు తెర‌పైకి వ‌చ్చిందో అర్ధం కావటంలేద‌న్నారు. విచిత్రం ఏమిటంటే చివ‌ర‌కు ఐఏఎస్ ల సంఘానికి ప్రెసిడెంట్ గా సోమేష్ కుమార్, కార్య‌ద‌ర్శిగా వికాస్ రాజ్ లే ఉన్నార‌న్నారు. వీరిద్ద‌రూ బీహార్ వారేన‌న్నారు. సంఘం ముసుగులో కొంత మంది నీతులు వ‌ల్లిస్తున్నార‌ని మండిప‌డ్డారు.

బ‌దిలీల‌పై నీతులు చెబుతున్న వారు గ‌తంలో కూక‌ట్ ప‌ల్లి నుంచి ఎల్బీ న‌గ‌ర్ కు రెండుసార్లు బ‌దిలీ చేసిన పైర‌వీలు చేసుకుని అక్క‌డే ఉండిపోయిన విష‌యాన్ని మ‌ర్చిపోతున్నార‌ని ఎద్దేవా చేశారు. విభ‌జ‌న త‌ర్వాత తెలంగాణ అభివృద్ధి చెందుతుందని, పరిపాలనలో మేధావి వర్గం భాగస్వామి అవుతుందని ఆశించామన్నారు. కానీ ఎనిమిదేళ్లుగా ఇంకా పరాయి పాలనలోనే మగ్గుతున్నామన్నారు. కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళు, అధికారులు బీహారీలేనని ఆయన పేర్కొన్నారు. ఉద్యమంలో కీలకంగా పనిచేసిన అధికారులు నిరాదరణకు గురవుతున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 157 మంది ఐఏఎస్,139 మంది ఐపీఎస్‌లు ఉండగా బీహార్ అధికారులను అందలం ఎక్కించడం వెనక ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. డీజీపీ పదవులు కూడా బీహార్ అధికారులకే ఇచ్చారన్నారు. బీహార్ అధికారులకు పదుల సంఖ్యలో శాఖలు కేటాయించారని ఆయన పేర్కొన్నారు.

Next Story
Share it