Telugu Gateway
Politics

మెఘా..ర‌జ‌త్ కుమార్ బిల్లుల చెల్లింపు పై రేవంత్ రెడ్డి లేఖ‌

మెఘా..ర‌జ‌త్ కుమార్ బిల్లుల చెల్లింపు పై రేవంత్ రెడ్డి లేఖ‌
X

దుమారం రేపుతున్న సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి ర‌జ‌త్ కుమార్ కుమార్తె పెళ్లి వేడుక‌ల బిల్లుల చెల్లింపు వ్య‌వ‌హారంపై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తాజాగా సీఎం కెసీఆర్ కు లేఖ రాశారు. ఇందులో ఆయ‌న ప్ర‌భుత్వం ముందు ప‌లు డిమాండ్లు పెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్య‌వ‌హారాల‌ను పర్యవేక్షిస్తున్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఇరిగేషన్) రజత్ కుమార్‌కు, అదే ప్రాజెక్టు కాంట్రాక్టర్‌ అయిన మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీకి మధ్య జరిగిన షెల్‌ కంపెనీల లావాదేవీలపై న్యాయస్థాన పర్యవేక్షణలో విచారణ జరిపించాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన సీఎంకు బహిరంగ లేఖ రాశారు. రజత్‌ కుమార్ కుమార్తె పెళ్ళి కోసం మేఘా ఇంజినీరింగ్ ప్రతినిధులు... షెల్‌ కంపెనీల ద్వారా డబ్బు తరలించారని 'ద న్యూస్‌ మినెట్' అనే వెబ్‌ పోర్టల్‌ నిన్న సాక్ష్యాలతో సహా వెల్లడించిన విషయం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ 17 - 21 మధ్య రజత్ కుమార్ కుమార్తె వివాహ వేడుకలను హైదరాబాద్ నగరంలోని తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్, తాజ్ డెక్కన్, తాజ్ కృష్ణా వంటి ఐదు స్టార్ హోటళ్లలో నిర్వహించినట్టు వెబ్‌ సైట్‌ పేర్కొందని, దీనికి సంబంధించిన ఖర్చులను 'బిగ్ వేవ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్', 'ఇంటరాక్టివ్ డేటా సిస్టమ్' అనే షెల్ కంపెనీలు చెల్లించినట్టు పోర్టల్ పేర్కొన్న అంశాన్ని రేవంత్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.

ఈ షెల్ కంపెనీలకు కాళేశ్వరం కాట్రాక్టులు పొందిన 'మేఘా' కంపెనీకి సంబంధాలు ఉన్నట్టు ఆ కథనంలో పేర్కొన్నారని, కాళేశ్వరంలో అవినీతిపై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆ పోర్టల్ కథనంలో వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవిగా భావించాల్సి ఉంటుందని రేవంత్ తెలిపారు. ''సాగునీటి శాఖ ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో మీరే నిర్వహిస్తున్నారు. ఆరోపణలు వచ్చిన సీనియర్ ఐఎఎస్ అధికారి రజత్ కుమార్ మీ పర్యవేక్షణలోనే పని చేస్తున్నారు. ఆయన పై ఆరోపణలు వచ్చి 48 గంటలు కావస్తున్నా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఖండన కానీ, వివరణ కానీ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మీ పేషీలో పని చేసే అధికారిపై ఇంతటి తీవ్ర ఆరోపణలు వస్తే మీరు తేలుకుట్టిన దొంగల్లా ఉండటం సరికాదు. రజత్ కుమార్ కుమార్తె వివాహానికి సంబంధించి పలు హోటళ్లు , ప్యాలెస్ లలో గదులు బుక్ చేయడానికి కంపెనీ ఉద్యోగులు మురళీ , ప్రమీలన్ ఫేక్ మెయిల్ ఐడీలు ఉపయోగించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. వార్త కథనంలో పేర్కొన్న ఆధారాలను పరిశీలిస్తే ఇది పూర్తిగా క్విడ్ ప్రో కో వ్యవహారంగా అనిపిస్తోంది.

రజత్ కుమార్ కుమార్తె వివాహానికి రూ .50 లక్షల పై చిలుకు బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఈ షెల్ కంపెనీలకు ఎందుకు ఉంటుంది? రజత్ కుమార్ కు , ఈ కంపెనీలకు మధ్య జరిగిన లావాదేవీలు, అందులో వాస్తవాలు బయటకు రావడానికి ఉన్నత స్థాయి విచారణ జరిపించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాను. ఒక్క అధికారికే రూ .50 లక్షలు ముట్టాయంటే ప్రభుత్వంలోని పెద్దలకు, ఇతర అధికారులకు ఏ మేరకు ముట్టిఉంటాయో అన్న అనుమానం తెలంగాణ సమాజంలో ఉంది . ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో ఇప్పటి వరకు వచ్చిన ఆరోపణలపై కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉంద''ని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ డిమాండ్ల‌పై సీఎం స్పందించ‌కుంటే ఆయ‌న వ్య‌వ‌హ‌రిశైలిని కూడా ప్ర‌జ‌లు అనుమానించే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని తెలిపారు. ఈ ప్రాజెక్టులో అవినీతిపై కొంత కాలంగా జ‌రుగుతున్న ప్ర‌చారం నిజం అని న‌మ్మాల్సి ఉంటుంద‌ని త‌న లేఖ‌లో ప్ర‌స్తావించారు.

Next Story
Share it