రాజకీయ ప్రయోజనాల కోసమే జలజగడం
టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఇప్పుడు జల వివాదాన్ని తెరపైకి తెచ్చారని రేవంత్ ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు నీళ్లు ఏటీఎంగా మారిపోయాయని అన్నారు. గురువారం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. ఓట్లు కావాలంటే కేసీఆర్ నీళ్లనే బూచిగా చూపిస్తారని విమర్శించారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో ఏపీ, తెలంగాణ సీఎంలు లేని మంట పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కాపురం దారి దోపిడి దొంగల మాదిరి జగన్ ఇక్కడి నీటిని జలదోపిడి చేస్తున్నారన్నారు. ప్రగతిభవన్‌లోనే రాయలసీమ ప్రాజెక్టు డ్రాఫ్ట్ తయారైందని రేవంత్‌రెడ్డి చెప్పారు. సీఎం జగన్ తెచ్చిన జీవోను అడ్డుకోవాలని నాగం జనార్దన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తే పట్టించుకోలేదన్నారు. ఎన్టీఆర్, వైఎస్‌ను తిట్టేవారు నికృష్టులన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాగునీటి మంత్రి ఏం చేస్తున్నారో తెలియడం లేదని రేవంత్‌రెడ్డి చెప్పారు. జగన్ నువ్వు ఇక్కడ ప్రజల గురించి ఆలోచిస్తున్నావంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. వైఎస్‌ను దొంగా అని తిడితే కూడా జగన్, విజయలక్ష్మి నోరు తెరువలేదని రేవంత్‌రెడ్డి చెప్పారు. వైఎస్ ఇచ్చిన పదవులు, ఆస్తులు కావాలి కానీ ఆయన్ను తిడితే మీరు మాట్లాడరా అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వైషమ్యాలు రెచ్చగొడుతున్న వారిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. జగన్‌ను షర్మిల ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. నీళ్లు, నిధుల సెంటిమెంట్‌కే కేసీఆర్ బలవుతారని రేవంత్‌రెడ్డి చెప్పారు. షర్మిల పార్టీని బలోపేతం చేసే నీచపు క్రీడను కేసీఆర్ ఆడుతున్నారన్నారు.