వివాదంలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొత్త వివాదంలో చిక్కుకున్నారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పై ఆయన చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల ఆడియో ఒకటి దుమారం రేపుతోంది. ఈ ఆడియోను అధికార టీఆర్ఎస్ రేవంత్ పై దాడికి ఓ అస్త్రంగా మలచుకునే ప్రయత్నాల్లో ఉంది. మంత్రి కెటీఆర్ ఈ అంశంపై స్పందించారు. రేవంత్ రెడ్డి లాంటి నీచమైన నాయకుల నైజాన్ని ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉందని కెటీఆర్ వ్యాఖ్యానించారు. శశిథరూర్ ఒక గాడిద అంటూ చేసిన రేవంత్ వ్యాఖ్యల ఆడియో ని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. దీన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కూడా ట్యాగ్ చేశారు. ఒక థర్డ్ రేటెడ్ క్రిమినల్ ఒక పార్టీకి నాయకత్వం వహిస్తే ఇలానే ఉంటుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఫోరెన్సిక్ పరీక్షకు పంపితే ఓటుకు నోటు కేసులో దొరికిన ఆడియోతో ఇది సరిపోతుందన్నారు. రాజకీయాల్లో ఇలాంటి నీచత్వాన్ని చెత్తను ఎండగట్టాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నేత మనీష్ తివారి కూడా ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై శశిథరూర్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. - రేవంత్ రెడ్డి ఆయన మూలాలను గుర్తుంచుకొనే గాడిద అనే మాట మాట్లాడారేమో అని వ్యంగాస్త్రాలు సంధించారు. రేవంత్ రెడ్డి ఇటీవల శశిధరూర్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని ప్రచురించింది. దీంతో కొత్త వివాదం రాజుకుంది.