ఫిక్స్ చేసేందుకు రేవంత్..ఎగ్జిట్ కోసం కోమటిరెడ్డి!
మునుగోడు ఉప ఎన్నికలో తన సోదరుడిని కాదని కాంగ్రెస్ అభ్యర్ధికి భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మద్దతు ఇచ్చే ఛాన్సే లేదు. ఈ విషయం పార్టీలో నేతలు అందరికీ తెలుసు. దీంతో ఎవరి రాజకీయాలు వాళ్లు చేస్తున్నారు. కాంగ్రెస్ ను వీడేందుకు బలమైన కారణాలు వెతుక్కునే పనిలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉండగా..తమ తప్పేమీలేదని..ఆయన తన సోదరుడి కోసం..బిజెపికి మేలు చేసేందుకే పార్టీని వీడారని ఫిక్స్ చేసే పనిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకే ఆకస్మికంగా టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్వయంగా వెంకటరెడ్డి డిమాండ్ మేరకు క్షమాపణలు చెప్పారు. ఎంపీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అద్దంకి దయాకర్ రెండవ సారి క్షమాపణలు చెప్పటంతో పాటు..భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా చూసుకుంటానని ప్రకటించారు. అయినా సరే కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాంతించకుండా అద్దంకి దయాకర్ ను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించినప్పుడే రేవంత్ రెడ్డి క్షమాపణల గురించి ఆలోచిస్తానని ప్రకటించారు. దీనర్ధం ఆయన ఏజెండా వేరు అనే విషయం తేలిపోతుంది. నేరుగా రేవంత్ కు ఈ విమర్శలతో సంబంధం లేకపోయినా ఆయన ఉన్న సభలో చేసిన విమర్శలు కాబట్టి వెంకటరెడ్డి డిమాండ్ మేరకు రేవంత్ క్షమాపణ చెప్పారు.
అంతకు ముందు ఢిల్లీలో కూడా ఇలాంటి వ్యాఖ్యలను తానూ..కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం ఆమోదించదన్నారు. అయినా సరే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు అద్దంకి దయాకర్ బహిష్కరణ డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. అది ఎలాగూ చేయరు...ఈ పేరు చెప్పుకుని బయటకు పోవాలన్నది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్లాన్ గా భావిస్తున్నారు. స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాంగ్రెస్ సీనియర్ నేత, అధిర్ రంజన్ చౌదరి రాష్ట్రపత్నిఅంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసి..తర్వాత ఆమెకు స్వయంగా తప్పు అయిందని..క్షమించాలని కోరారు. ఆమె నుంచి ఎలాంటి ప్రకటన లేకపోయినా ఈ వివాదం సద్దుమణిగిపోయింది. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం నిత్యం ఏదో ఒక డిమాండ్ ను తెరపైకి తెస్తూ సమస్యను సాగదీస్తున్నారు. కాంగ్రెస్ నేతలు ఎంత తగ్గినా ఆయన మాత్రం కాలుదువ్వుతున్నారు. ఇది అంతా పక్కా ప్రణాళిక ప్రకారమే సాగుతుందని భావిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల తేదీ నాటికి వెంకటరెడ్డి కూడా బిజెపి వైపు చేరతారనే ప్రచారం బలంగా ఆ పార్టీ నేతల్లో సాగుతోంది.