రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్..స్పీకర్ కు ఫిర్యాదు
హైదరాబాద్ లో కోకాపేట భూముల వేలం సెగ కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ నేతలు సోమవారం నాడు ఈ ప్రాంతాన్ని సందర్శించి..అక్కడ ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో తెలంగాణ పోలీసులు ముందుగానే కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఇందులో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితోపాటు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి తదితరులు ఉన్నారు.ఈ భూముల అమ్మకాల్లో వెయ్యి కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను అధికార టీఆర్ఎస్ ఖండిస్తోంది. వంద కోట్ల రూపాయలకు రేవంత్ రెడ్డి టెండర్ వేస్తే ఎవరు వద్దన్నారంటూ ఆ పార్టీ నేతలు ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే తనను హౌజ్ అరెస్ట్ చేయడంపై లోక్‌సభ స్పీకర్‌కు టీపీసీసీ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాకుండా అడ్డుకుని తన హక్కులకు భంగం కలిగించారంటూ రేవంత్ ఫిర్యాదు చేశారు. ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాకుండా అడ్డుకున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కోకాపేట భూముల అంశాన్ని తాము పార్లమెంట్ లో లేవనెత్తుతామని కూడా ప్రకటించామన్నారు. వాస్తవాలు అన్నీ తెలిసి కూడా తన అక్రమ అరెస్ట్ కు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.