రేవంత్ ఫిర్యాదు..అస్సాం సీఎంపై కేసు నమోదు

కీలక పరిణామం. హైదరాబాద్ లో అస్సాం సీఎం హిమంత బిశ్వా శర్మపై జూబ్లిహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు అయింది. రాహుల్ గాంధీపై శర్మ వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ సోమవారం నాడు తెలంగాణ అంతటా ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. జూబ్లిహిల్స్ పోలీసులు అస్సాం సీఎంపై మూడు సెక్షన్‌ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్‌లో ఆధారాలు బయటపెట్టాలంటూ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
ఈ విషయానికి సంబంధించి రాహుల్‌పై అస్సాం సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ పుట్టుక గురించి తాము ఆధారాలు అడిగామా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు దేశంలో పెనుదుమారాన్ని రేపాయి. తెలంగాణ సీఎం కెసీఆర్ కూడా అస్సాం సీఎం వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందించి..ప్రధాని మోడీ, బిజెపి ప్రెసిడెంట్ నడ్డాలు వెంటనే అస్సాం సీఎంను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. తన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చినా సరే హిమంత బిశ్వ శర్మ మాత్రం తన వైఖరిని అలాగే కొనసాగిస్తూ మరింత పరుషంగా తన దాడిని కొనసాగిస్తున్నారు.



