Telugu Gateway
Politics

కెసీఆర్ కబంధ హ‌స్తాల నుంచి తెలంగాణ విముక్తే నా టార్గెట్

కెసీఆర్ కబంధ హ‌స్తాల నుంచి తెలంగాణ విముక్తే నా టార్గెట్
X

ప్ర‌జ‌ల క‌ష్టాలు చూసి సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే..రాష్ట్రం ఇవాళ దొంగ‌ల పాలైంద‌ని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ‌లో మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి సీఎం కెసీఆర్ కు తెలియ‌దా అని ప్ర‌శ్నించారు. రాష్ట్రాన్ని ప‌ట్టి పీడిస్తున్న దోపిడీ వ‌ర్గాల నుంచి విముక్తి క‌ల్పించ‌టానికి శ‌క్తి వంచ‌న‌లేకుండా పోరాడ‌తాన‌ని ప్ర‌క‌టించారు. కెసీఆర్ కబంధ హ‌స్తాల్లో బందీ అయిన తెలంగాణ‌కు విముక్తి కల్పించ‌ట‌మే త‌న ధ్యేయ‌మన్నారు. మంగ‌ళ‌వారం నాడు ములుగు ఎమ్మెల్యే సీత‌క్క భారీ ర్యాలీతో వ‌చ్చి నూత‌న పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని అభినందించారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ మాట్లాడుతూ సీతక్క తనతో సరిసమానమని వ్యాఖ్యానించారు. ఒకటే కుర్చీ ఉంటే.. ఆ కుర్చీలో సీతక్కనే కూర్చో పెడతానన్నారు. సీతక్క తనకు అండగా వుందని, రాబోయే రోజుల్లో రాష్ట్ర నలుమూలల తిరగాల్సి ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. '' నాకు పీసీసీ పదవీ వస్తదని నిఘా వర్గాల రిపోర్ట్ రాగానే.. ప్రగతి భవన్ తలుపులు తెరిచారు. ఖబర్దార్ కేసీఆర్.. నీ సంగతి చూస్తా. కరెంట్ తీగలా కాదు.. హై టెన్షన్ వైరులా కొట్లాడతాం. పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ, సీఐలకు పోస్టింగ్ ఇవ్వాలంటే లక్షల్లో వసూలు చేస్తున్నారు. టీఆర్ఎస్ జెండా మోసిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు సంతోషంగా ఉన్నారా?. గుండె మీద చేయి వేసుకొని చెప్పండి. దిక్కులేక స్థానిక ప్రజాప్రతినిధులు బ్రోకర్లుగా, పైరవీకారులుగా మారుతున్నారు.

లోకల్ లీడర్లు రోడ్లపై పడ్డారు. టీఆర్ఎస్ స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా నిధులు లేక సొంత డబ్బులను ఖర్చు చేస్తున్నారు. ఈ పాలనలో స్థానిక ప్రజా ప్రతినిధులకు విలువ లేకుండా పోయింది.'' అని రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌తిపక్షంలో ఉన్న పార్టీని అధికారంలోకి తేవడానికే తాము కాంగ్రెస్‌ పార్టీలో చేరామని ఎమ్మెల్యే సీతక్క స్పష్టం చేశారు. తాము అధికారాన్ని అనుభవించడానికి కాంగ్రెస్‌లోకి రాలేదని ఆమె అన్నారు. పార్టీ పలుచన అయ్యేలా ఎవరూ మాట్లాడొద్దని ఆమె పేర్కొన్నారు. మెజారిటీ అభిప్రాయం మేరకే రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి వచ్చిందన్నారు. పార్టీని అధికారంలోకి తెచ్చినప్పుడే తమకు నిజమైన సంతోషమని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఓట్ల కోసమే సీఎం కేసీఆర్‌ హడావుడి మీటింగ్‌లు పెడుతున్నారని ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. రాజయ్యకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి తిరిగి గుంజుకున్నారని సీతక్క విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను కూడా పక్క దారి పట్టించారని ఆరోపించారు. గిరిజనులకు సీఎం అన్యాయం చేస్తున్నారన్నారు. మోసం చేయడంలో కేసీఆర్‌ దిట్ట అని సీతక్క ఆరోపించారు.

Next Story
Share it