కెసీఆర్ ఉద్యోగం పోతుందనే ఈ ఉద్యోగ నియామకాల ప్రకటన
ముఖ్యమంత్రి కెసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటనపై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసనసభలో కెసీఆర్ మరోసారి అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. బిశ్వాల్ కమిటీ రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని నివేదిక ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ..సీఎం సభలో 80 వేల ఉద్యోగాలు గురించే మాట్లాడారు..మరి మిగిలిన లక్ష ఉద్యోగాలు కాకి ఎత్తుకుపోయిందా అని ప్రశ్నించారు. కెసీఆర్ ఉద్యోగం పోతే తప్ప రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రావన్నారు. ఆయన ఉద్యోగం ఊడే పరిస్థితి వచ్చేవరకే ఇప్పుడు ఉద్యోగ ప్రకటనల నాటకానికి తెరతీశారన్నారు. ఇది చూసి కూడా కొంత మంది సన్నాసులు పాలాభిషేకాలు చేస్తున్నారని..కెసీఆర్ ఇప్పుడు చేసింది ప్రకటనే అని..ఇంకా నోటిఫికేషన్లు కూడా రాలేదన్నారు.
మళ్ళీ ఒకసారి నిరుద్యోగులను మోసం చేయటానికి..తెలంగాణ సమాజాన్ని మభ్యపెట్టడానికే ఈ డ్రామా అన్నారు. 12 నెలల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని..అప్పుడు ఖాళీలు అన్నీ భర్తీ చేస్తుందని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తుందని పేర్కొన్నారు. ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్ ప్రకారమే ఇది అంతా సాగింది తప్ప..ఇది చిత్తశుద్ధితో చేసిన ప్రకటన కాదన్నారు. కాంగ్రెస్ నిరుద్యోగ అంశంపై చేస్తున్న పోరాట భయంతోనే సీఎం కెసీఆర్ హడావుడిగా ఈ ప్రకటనలు చేశారన్నారు. నియామకపత్రాలు ఇచ్చినప్పుడే కేసీఆర్ హామీ నెరవేర్చినట్లు అవుతుందని రేవంత్ వ్యాఖ్యానించారు.