సీబీఐ విచారణకు ఆదేశించండి..కెసీఆర్ అవినీతికి ఆధారాలిస్తా
టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బిజెపి నేతలు తెలంగాణ సీఎం కెసీఆర్ పై సీబీఐ విచారణకు ఆదేశిస్తే ఆయన అవినీతిని తాను నిరూపిస్తానని సవాల్ విసిరారు.అలా చేయలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. కొంపల్లిలో సాగుతున్న కాంగ్రెస్ కార్యకర్తల శిక్షణా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం కెసీఆర్, బండి సంజయ్ ల మీడియా సమావేశాలు కల్లు కాంపాండ్లను తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ వేలాది కోట్ల అవినీతికి పాల్పడ్డారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గత 5 నెలలుగా కేంద్రమంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్ కోసం చూస్తున్నామని, కేసీఆర్ అవినీతిపై ఆధారాలు ఇస్తామని ప్రకటించారు.
''తెలంగాణ ఏర్పడితే నీళ్లు, నియామకాలు మన చేతుల్లోకి వస్తాయన్నారు. నీళ్లు, నియామకాలు అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని కొల్లగొట్టారు. ప్రాణహిత, చేవెళ్ల నిర్మిస్తే కమీషన్లు రావని రీడిజైన్ చేశారు. ప్రాజెక్టులపై వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశించే దమ్ము ప్రభుత్వానికి ఉందా?'' అని రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణలో కాంగ్రెస్ చర్చ లేకుండా చేసేందుకే రెండు పార్టీలు కలసి ఈ నాటకం ఆడుతున్నాయని..వీటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు రేవంత్. ఒక్క విద్యుత్ ప్రాజెక్టుల్లోనే కెసీఆర్ వెయ్యి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని రేవంత్ ఆరోపించారు.