Telugu Gateway
Politics

పీసీసీ ప్రెసిడెంట్ గా బాధ్య‌తలు చేప‌ట్టిన రేవంత్

పీసీసీ ప్రెసిడెంట్ గా బాధ్య‌తలు చేప‌ట్టిన రేవంత్
X

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల కోలాహలం మ‌ధ్య నూత‌న పీసీసీ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి బుధ‌వారం మ‌ద్యాహ్నాం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. మాజీ పీసీసీ ప్రెసిడెంట్ ఉత్త‌మ్ కుమార్ గాంధీభ‌వ‌న్ లో రేవంత్ కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇన్ ఛార్జి మాణికం ఠాకూర్, సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, సీనియ‌ర్ నేత‌లు దామోద‌ర్ రాజ‌న‌ర్సింహ‌, పొన్నాల, గీతారెడ్డి, నాగం జ‌నార్ధ‌న్ రెడ్డి, మ‌హేశ్వ‌ర్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు. పూజారుల మంత్రోచ్చార‌ణ‌ల మ‌ధ్య ఈ కార్య‌క్ర‌మం సాగింది.రేవంత్ రెడ్డి బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ సంద‌ర్భంగా నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తో గాంధీ భ‌వ‌న్ కిక్కిరిసిపోయింది. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎంట్రీతో తెలంగాణ‌లో రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మార‌నున్నాయి.

దూకుడుగా వ్య‌వ‌హ‌రించే రేవంత్ తాను భ‌విష్య‌త్ లో ఎలా ఉండ‌బోతున్న‌ది సంకేతాలు ఇచ్చారు కూడా. తాను బాధ్య‌త‌లు చేప‌ట్టాక కాంగ్రెస్ నుంచి పార్టీ ఫిరాయించిన వారి సంగ‌తి చూస్తాన‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. అంతే కాకుండా అమ‌ర‌వీరుల స్థూపంలో కూడా భారీ ఎత్తున అవినీతి జ‌రిగింద‌ని..బాధ్య‌త‌లు చేప‌ట్టాక ఈ బండారం బ‌య‌ట‌పెడ‌తాన‌ని ప్ర‌క‌టించారు. రేవంత్ రాక‌తో కాంగ్రెస్ పార్టీలో ఒక‌ర‌మైన జోష్ అయితే వ‌చ్చింద‌ని చెప్పొచ్చు. మ‌రి ఈ జోష్ ను రేవంత్ ఏ మేర‌కు నిల‌బెట్టుకుంటూ ముందుకు సాగుతారో వేచిచూడాల్సిందే.

Next Story
Share it