చలో రాజ్ భవన్ ను అడ్డుకుంటే పోలీస్ స్టేషన్ల ముట్టడి
కాంగ్రెస్ పార్టీ శుక్రవారం పెట్రో ఉత్పత్తుల ధరల పెంపునకు నిరసనగా చలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చింది. ధర్నాచౌక్ నుంచి రాజ్ భవన్ వరకూ వెళ్తామని..దీన్ని అడ్డుకుంటే పోలీస్ స్టేషన్ల ముట్టడికి పిలుపునిస్తామని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఎంత మందిని అరెస్ట్ చేస్తారో..జైల్లో పెడతారో చూస్తామన్నారు. కరోనా కారణంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే ప్రధాని మోడీ, సీఎం కెసీఆర్ ప్రజలను పన్నుల పెంపుతో దోచుకుంటున్నారని విమర్శించారు.
రేవంత్ రెడ్డి గురువారం నాడు గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. రేపు ఉదయం 10 గంటలకు ఇందిరాపార్క్ నుంచి ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. గవర్నర్‌కు వినతిపత్రం అందజేస్తామన్నారు. ధరలపై పార్లమెంట్‌ను కూడా స్తంభింపజేస్తామని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఇటీవల జిల్లాల్లో నిర్వహించిన సైకిల్ ర్యాలీలు, నిరసన ప్రదర్శనలకు మంచి స్పందన వచ్చిందని తెలిపారు. ఎన్ని లక్షల మంది కాంగ్రెస్ కార్యకర్తలను జైల్లో పెడతారని ప్రశ్నించారు.