Telugu Gateway
Politics

వ్యవసాయ చట్టాలు రద్దు చేయాల్సిందే

వ్యవసాయ చట్టాలు రద్దు చేయాల్సిందే
X

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలోని బృందం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు గురువారం నాడు వినతిపత్రం అందజేసింది. ఈ బృందంలో రాహుల్ గాంధీతో పాటు గులాం నబీ ఆజాద్, ఆధిర్ రంజన్ చౌదరి ఉన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా సేకరించిన 2 కోట్ల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని రాష్ట్రపతికి అందజేశారు. సాగు చట్టాలపై జోక్యం చేసుకోవాల్సిందిగా రాష్ట్రపతిని కోరినట్లు తెలిపారు. రామ్ నాథ్ కోవింద్ తో సమావేశం అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. చట్టాలను రద్దు చేసే వరకూ రైతులు ఢిల్లీ వదిలి వెళ్ళరని ప్రకటించారు. కోట్లాది మంది ఆధారపడి ఉన్న వ్యవసాయ రంగాన్ని మోడీ సర్కారు నాశనం చేస్తోందని ధ్వజమెత్తారు.

తప్పుడు పద్దతులతో వీటిని ఆమోదింపచేసుకున్నారని విమర్శించారు. కార్పొరేట్ల కోసమే మోడీ పనిచేస్తున్నారని..అందుకే రైతులు అంతగా ఆందోళన చేస్తున్నా చట్టాల విషయంలో మొండి వైఖరి చూపిస్తున్నారని విమర్శించారు. కేవలం ఇద్దరు, ముగ్గురు కోసం ప్రధాని మోడీ పనిచేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడితే వారిని దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. వెంటనే పార్లమెంట్ ను సమావేశపర్చి ఈ చట్టాలను రద్దు చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అంతకు ముందు ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలతో రాహుల్ గాంధీ కిసాన్ ర్యాలీ నిర్వహించారు. అయితే దీనికి అనుమతి లేదని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయటంతో కొంత సేపు ఘర్షణ నెలకొంది.

Next Story
Share it