తెలంగాణలో రాజన్న రాజ్యం
దివంగత రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయ బరిలో దిగారు. పార్టీపై అధికారిక ప్రకటన చేయకపోయినా..తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తాం కీలక ప్రకటన చేశారు. ఆమె మంగళవారం నాడు లోటస్ పాండ్ లో నల్లగొండ జిల్లాకు చెందిన వైఎస్ఆర్ అభిమానులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను ప్రసంగించటానికి రాలేదని..అందరి అభిప్రాయాలు తీసుకోవటానికి వచ్చానన్నారు. అన్ని జిల్లాల నేతలు, కార్యకర్తలతో సమావేశం అయిన తర్వాత ప్రకటన చేస్తాననన్నారు. ''ఇప్పుడు తెలంగాణలో రాజన్న రాజ్యం లేదు. రాజన్న రాజ్యం ఎందుకు రాకూడదు. ఇంటి వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి అభిమానులకు అభివాదం చేశారు.
ఈ సందర్భంగా అభిమానులు షర్మిలపై కాగితపు పూల వర్షం కురిపించారు. బాణ సంచా కాలుస్తూ.. నృత్యాలతో సందడి చేశారు. వైఎస్సార్ అభిమానులారా తరలి రండి.. అని గతంలో వైఎస్‌తో అనుబంధం ఉన్న నేతలకు, ఆయనతో పని చేసిన వారికి షర్మిల తరఫున ఫోన్ చేసి సమావేశానికి ఆహ్వానించారు. షర్మిల ఇంటి పరిసర ప్రాంతాల్లో భారీగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్లెక్సీలపై ఎక్కడా సీఎం జగన్ ఫొటోలు లేకుండా.. షర్మిల ఫొటోలను మాత్రమే ఏర్పాటు చేశారు. వైఎస్ అభిమానులు షర్మిల ఇంటికి భారీగా చేరుకోవడంతో ఆ ప్రాంతంలో కోలాహలం నెలకొంది.