Telugu Gateway
Politics

రాజకీయాలకు రజనీకాంత్ గుడ్ బై

రాజకీయాలకు రజనీకాంత్ గుడ్ బై
X

రాక ముందే రాజకీయాల నుంచి వెనక్కి. దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ మంగళవారం నాడు కీలక ప్రకటన చేశారు. తాజాగా ఆయన అనారోగ్యం పాలయ్యారు. ఆరోగ్యం సహకరించని కారణంగా రాజకీయాల నుంచి విరమించుకున్నట్లు మూడు పేజీల ప్రకటన విడుదల చేశారు. తనకు అరోగ్యం సహకరించనందున రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. వాస్తవానికి డిసెంబర్ 31న ఆయన రాజకీయ పార్టీ..ఇతర అంశాలపై ప్రకటన చేయాల్సి ఉంది. కానీ కుటుంబ సభ్యుల సూచన మేరకు రజనీకాంత్ రాజకీయాలపై వెనక్కి తగ్గినట్లు కన్పిస్తోంది. ఎప్పటి నుంచో రాజకీయాలపై రజనీకాంత్ ఊగిసలాట ధోరణి చూపిస్తూ వచ్చారు. కానీ ఈ మధ్యే కీలక ప్రకటన చేశారు.

అంతలోనే అనారోగ్యం పాలు కావటంతో ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పట్లో పార్టీ ప్రకటన ఉండబోదని అభిమానులకు స్పష్టమైన సంకేతం ఇచ్చారు. రాజకీయాల్లోకి రాకుండా ప్రజలకు సేవ చేస్తానన్నారు. రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై ఆయన అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. రజనీ తాజా ప్రకటనతో వారంతా తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఎన్నో సంవత్సరాలుగా అభిమానులు కోరుకున్నట్లుగా రాజకీయాల్లోకి ప్రవేశిద్దామని అనుకున్నానని..కానీ తన అనారోగ్య సమస్యల కారణంగా బయటకు వచ్చి తిరిగే పరిస్థితిలేదని పేర్కొన్నారు.

Next Story
Share it