Telugu Gateway
Politics

రజనీకాంత్ డిసైడ్ అయ్యారు

రజనీకాంత్ డిసైడ్ అయ్యారు
X

వస్తారా?. అసలు వస్తారా?. రజనీకాంత్ రాజకీయ ప్రవేశ వార్తలపై చాలా మందిలో ఒక రకమైన నిర్లిప్తత వచ్చింది. ఎందుకంటే అదిగో వస్తున్నాడు ..అదుగో అంటూ కొన్ని సంవత్సరాలుగా వార్తలు చాలా వచ్చాయి. చాలా మంది ఇది జరిగే పని కాదులే అనుకున్నారు. మధ్యమధ్యలో ఇలాంటి వార్తలు వచ్చినా సర్లే వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్నారు. కానీ సారి మాత్రం రజనీకాంత్ భాషా ఒక్కసారి చెపితే వందసార్లు చెప్పినట్లే డైలాగ్ ను పక్కా చేసినట్లు కన్పిస్తోంది. నా రహదారి..ఒక్కసారి డిసైడ్ అయితే ఫీల్డ్ లోకి దిగినట్లే అన్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. జనవరిలో కొత్త పార్టీ పెట్టనున్నట్లు తలైవా గురువారం ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు డిసెంబరు 31న వెల్లడిస్తానని ట్విటర్‌ వేదికగా స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని, గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడును సమూలంగా మారుస్తామని పేర్కొన్నారు. తనకు మద్దతుగా నిలుస్తున్న వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞ తలు తెలిపారు. దీంతో తమకు అదిరిపోయే న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ ఇచ్చారంటూ తలైవా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రజనీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తుండటంతో ఫ్యాన్స్‌ జోష్ లో ఉన్నారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రజనీ మక్కల్‌ మండ్రం ముఖ్య నిర్వాహకులు, జిల్లాల కార్యదర్శులతో సోమవారం రజనీకాంత్‌ భేటీ అయిన విషయం తెలిసిందే. చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మండపం వేదికగా ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 'మా అభిప్రాయాలను పంచుకున్నాం. నేను ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అండగా ఉంటామనే భరోసా ఇచ్చారు. వీలైనంత త్వరగా నా నిర్ణయం ప్రకటిస్తాను' అని రజనీ వెల్లడించారు. ఈ క్రమంలో నేడు పార్టీ ప్రారంభం గురించి ప్రకటన విడుదల చేయడం గమనార్హం. సినీరంగం నుంచి రాజకీయాల్లో ప్రవేశించి ముఖ్యమంత్రులుగా తమదైన ముద్రవేసిన కరుణానిధి, జయలలిత మరణం తర్వాత తమిళనాట రాజకీయాలు అస్తవ్యస్తంగా మారిన విషయం తెలిసిందే. రజనీ రాజకీయ ప్రకటనపై బిజెపి స్పందించింది. తమిళనాడులో జయలలిత, కరుణానిధి వంటి నేతలు లేని లోటును తీరుస్తారని బిజెపి వ్యాఖ్యానించటం విశేషం.

Next Story
Share it