Telugu Gateway
Politics

ఉస్మానియాలో రాహుల్ స‌భ‌కు నో

ఉస్మానియాలో రాహుల్ స‌భ‌కు నో
X

కాంగ్రెస్ అగ్ర‌నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివ‌ర్శిటీ ఆర్ట్స్ కాలేజీ వ‌ద్ద నిర్వ‌హించాల‌ని ప్ర‌తిపాదించిన స‌భ‌కు అనుమ‌తి ల‌భించ‌లేదు. ఈ స‌భ‌కు అనుమ‌తి ఇవ్వ‌రాద‌ని యూనివ‌ర్శిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణ‌యం తీసుకుంది. యూనివ‌ర్శిటీలో ఎలాంటి రాజ‌కీయ స‌భ‌లు. స‌మావేశాల‌కు అనుమ‌తి ఇవ్వ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు. రాహుల్ గాంధీ మే 6,7 తేదీల్లో తెలంగాణలో ప‌ర్య‌టించ‌నున్న విష‌యం తెలిసిందే. మే 6న వ‌రంగ‌ల్ లో చ‌రిత్ర‌లో నిలిచిపోయేలా రైతులతో బ‌హిరంగ స‌భ నిర్వ‌హించాల‌ని టీపీసీసీ నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. తెలంగాణ‌లో తాము అధికారంలోకి వ‌స్తే రైతుల‌కు ఎలాంటి ఉప‌శ‌మ‌న చ‌ర్య‌లు చేప‌ట్ట‌బోతున్న‌ది ఈ స‌భ ద్వారా సందేశం ఇచ్చేప్ర‌య‌త్నం చేయ‌నున్నారు. ఎన్నిక‌ల‌కు ఇంకా చాలా స‌మ‌యం ఉన్న త‌రుణంలో ఇలా రాహుల్ తో ముందే ప్ర‌క‌ట‌న చేయించ‌టం వ‌ల్ల ఉప‌యోగం ఉంటుంద‌ని పీసీసీ భావిస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్ రాహుల్ స‌భ‌పై భారీ ఆశ‌లే పెట్టుకుంది. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప‌లు జిల్లాల్లో ప‌ర్య‌టించి ఈ స‌భ‌కు చేయాల్సిన జన స‌మీక‌ర‌ణ‌తోపాటు ఏర్పాట్ల అంశంపై కూడా చ‌ర్చించారు. హైద‌రాబాద్ రాహుల్ ఉస్మానియా స‌భ బాధ్య‌త‌లు చూస్తున్న పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి శ‌నివారం నాడ మీడియాతో మాట్లాడారు. ఓయూలో ఏఐసీసీ నేత రాహుల్‌ సభకు వీసీ అనుమతి నిరాకరించారని జగ్గారెడ్డి తెలిపారు. ఓయూలో రాహుల్ పర్యటనకు ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదన్నారు. తెలంగాణ ఇచ్చిన రాహుల్‌కి ఇదేనా బహుమతి అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజకీయ నేతలకు ఓయూలో అనుమతి లేదనే తీర్మానాన్ని ఇప్పుడే బయటపెట్టడంలో మతలబేంటని అన్నారు. సమైక్య రాష్ట్రంలో ఓయూలో లేని నిబంధనలు కోరి తెచ్చుకున్న తెలంగాణలో నిబంధనలా అని ఆయన మండిపడ్డారు. ఇది సిగ్గుచేటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story
Share it