మోడీ, యోగీలపై రాహుల్ ఫైర్
దేశంలో రైతులపై వరస పెట్టి దాడులు జరుగుతున్నా కేంద్రం చోద్యం చూస్తోందని కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ లు అప్రజాస్వామిక విధానాలు అనుసరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాహుల్ గాంధీ బుధవారం నాడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అణచివేత చర్యలు, అరెస్ట్ లకు తాము భయపడబోమన్నారు. యూపీలో 144 సెక్షన్ ఉంటే తాము ముగ్గురిమే వెళతామని..అనుమతి ఇవ్వాలని కోరారు. బాధిత రైతుల కుటుంబాలను పరామర్శించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. లఖింపూర్ ఖేరీకి వెళ్లితీరతామన్నారు. మంగళవారం యూపీలోని లక్నోకు వెళ్లిన ప్రధాని లఖింపూర్‌ను ఎందుకు సందర్శించలేదు అంటూ ప్రశ్నించారు. ఆదివారం సాయంత్రం నిరసన చేపడుతున్న రైతుల మీదుగా కారు దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మరణించిన సంగతి తెలిసిందే.
ఇది దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతోంది. ఈ ఘటనపై విపక్ష పార్టీలు ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపడుతున్నాయి. రైతుల విషయంలో బిజెపి మూల్యం చెల్లించుకోకతప్పదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. లఖింపూర్ ఘటనలో కేంద్ర మంత్రి కుమారుడి నపేరు విన్పిస్తున్నా వారిపై ఇంత వరకూ చర్యలు లేవన్నారు. కానీ బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంకగాంధీని ఎందుకు అరెస్ట్ చేశారు అని ప్రశ్నించారు. అసలు ఆమెను ఎందుకు నిర్భందించారో పోలీసులు చెప్పాలన్నారు. అయితే రాహుల్ గాంధీ లఖింపూర్ వస్తే అడ్డుకుంటామని యూపీ పోలీసులు తెలిపారు. ఆయన వస్తే భద్రతాపరమైన సమస్యలు వస్తాయని..అందుకే పర్యటన వద్దని కోరుతున్నట్లు వారు చెబుతున్నారు. బుధవారం మధ్యాహ్నం రాహుల్ లఖింపూర్ బయలుదేరి వెళ్ళారు.