అంతర్గత..విదేశీ శక్తులతో ప్రమాదంలో భారత్
భారత దేశం ప్రస్తుతం తీవ్ర ప్రమాదంలో కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ ప్రమాదం విదేశీ శక్తుల నుంచే కాకుండా అంతర్గత శక్తుల నుంచి కూడా ఉందన్నారు. బిజెపి, ఆర్ఎస్ఎస్ లు దేశ మూలాలను..వ్యవస్థలను దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. కేంద్రంలోని మోడీ సర్కారు ప్రతి ఒక్కరిని అగౌరవ పరుస్తోందని మండిపడ్డారు. తనను అగౌరపర్చిన తాను పెద్దగా పట్టించుకోని..కానీ వ్యవస్థలను..దేశంలోని అందరినీ మోడీ సర్కారు అవమానిస్తోందని విమర్శలు గుప్పించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాహుల్ గాంధీ మాట్లాడారు. దేశం గతంలో ఎన్నడూలేని రీతిలో నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటోందని అన్నారు. గత 50 ఏళ్ళలో ఎప్పుడూలేనంత తీవ్రంగా నిరుద్యోగ సమస్య ఉందన్నారు. కానీ రాష్ట్రపతి తన ప్రసంగంలో ఈ విషయాన్ని మాట మాత్రంగానైనా ప్రస్తావించలేదన్నారు. మోడీ సర్కారు పేదలను కొట్టి పెద్దలకు పెడుతోందని విమర్శించారు.
రాహుల్ గాంధీ తన ప్రసంగంలో భారతదేశాన్ని రెండు దేశాలుగా అభివర్ణించారు. ఒకటి ధనవంతుల దేశం కాగా మరొకటి పేదల దేశమని, అయితే ఈ రెండు దేశాల మధ్య విభజన నానాటికీ పెరుగుతోందని ఆయన అన్నారు. ''మనకు రెండు భారతదేశాలు ఉన్నాయి. ఒకటి పూర్తిగా ధనవంతుల భారతదేశం. వీరికి వాస్తవానికి ప్రభుత్వం నుంచి నీటి సదుపాయం, విద్యుత్ సదుపాయం, ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం లేదు. వాళ్ల దగ్గర చాలా డబ్బు ఉంటుంది. అధికారం కూడా ఉంటుంది. కానీ ప్రభుత్వం నుంచి వీరికి అన్ని సదుపాయాలు అందుతున్నాయి. వాస్తవానికి ప్రభుత్వమే వారి కోసం పని చేస్తోంది. ఇంకొక భారతదేశం పూర్తిగా పేద ప్రజలది. వీరికి ప్రభుత్వం నుంచి ఆపన్న హస్తం అందాలి. కానీ వీరి గురించి ప్రభుత్వం ఆలోచించడం లేదు. మోదీ ప్రభుత్వ విధానాల వల్ల ఈ రెండు దేశాల మధ్య విభజన నానాటికీ పెరుగుతోంది. దేశంలోని 10 మంది ధనవంతుల వద్ద ఉన్న డబ్బు దేశంలోని 40 కోట్ల భారతీయుల ఆదాయంతో సమానం'' అని రాహుల్ గాంధీ అన్నారు. బడ్జెట్‌లో రైతులు, నిరుద్యోగులు, పేద వర్గాల గురించి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని రాహుల్ గాంధీ విమర్శించారు. ''రైల్వే పరీక్షల గురించి కేంద్ర ప్రభుత్వం ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
ఉద్యోగ కల్పన గురించి బడ్జెట్‌లో ఎలాంటి ప్రతిపాదన చేయలేదు. ప్రతి రాష్ట్రంలో యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం వారికి ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైంది'' అని రాహుల్ విమర్శించారు. చైనా, పాకిస్తాన్ ల నుంచి భారత్ కు తీవ్ర ప్రమాదం పొంచి ఉందని..ఈ విషయంలో మోడీ సర్కారు చాలా నిర్లిప్తంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేంద్ర విదేశీ విధానం లోపభూయిష్టంగా ఉందని ఆరోపించారు. రాజ్యాంగబద్ధ వ్యవస్ధలను ధ్వంసం చేస్తూ..రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. మోడీ ఓ రాజులాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మోడీ హయాంలోనే దేశంలోని 23 కోట్ల మంది పేదరికంలోకి వెళ్ళారని ఆరోపించారు. గత ఏడాది కాలంలోనే మూడు కోట్ల ఉద్యోగాలు పోయాయని అన్నారు. రాహుల్ తన ప్రసంగంలో పెగాసెస్ అంశాన్ని కూడా ప్రస్తావించారు. స్వయంగా మోడీ ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా దీనిపై ఒప్పందం చేసుకున్నారన్నారు. దీనిపై బిజెపి నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. సుప్రీంకోర్టులో ఉన్న అంశంపై సభలో మాట్లాడటం సరికాదని...బిజెపి సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.