Telugu Gateway
Politics

నా గ‌ళాన్ని తొక్కేయ‌టంలో పావుగా మారొద్దు

నా గ‌ళాన్ని తొక్కేయ‌టంలో పావుగా మారొద్దు
X

ట్విట్ట‌ర్ కు రాహ‌ల్ ఘాటు లేఖ‌

కాంగ్రెస్ నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్ట‌ర్ తీరును తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. నెల‌లో క‌నీసం న‌న్ను కూడా ఒక్క‌రు కూడా ఫాలో కాలేదా?. ఎందుకు ఆగ‌స్టు నుంచి నా ట్విట్ట‌ర్ ఫాలోయ‌ర్ల సంఖ్య త‌గ్గుతూ వ‌స్తోంది. ఇత‌ర ఖాతాల‌కూ..నా ఖాతాల‌కూ తేడా ఏమిటో మీరే చూడండి అంటూ ఆయ‌న ట్విట్ట‌ర్ సీఈవో ప‌రాగ్ అగ‌ర్వాల్ కు రాసిన లేఖ తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. ఇందులో రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీని మీడియాను అణ‌చివేస్తున్న ఈ త‌రుణంలో త‌మ‌కు ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై స్పందించేందుకు ట్విట్ట‌ర్ వంటి వేదిక‌లే మార్గం అయ్యాయ‌ని..కానీ ఇక్క‌డ కూడా ప్ర‌భుత్వ బెదిరింపులు..ఒత్తిడితో ఇలా చేయ‌టం స‌రికాదంటూ పేర్కొన్నారు. వాక్ స్వాతంత్రాన్ని అడ్డుకోవ‌టంలో ట్విట్ట‌ర్ భాగ‌స్వామి అవుతోంద‌ని ఆయ‌న ఆరోపించారు. రాహుల్ గాంధీ రాసిన ఈ లేఖలో తన ట్విటర్ ఖాతాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ల ట్విటర్ ఖాతాలతో పోల్చుతూ విశ్లేషణాత్మక వివరాలను ప్ర‌స్తావించారు. 2021లో మొదటి ఏడు నెలల్లో సగటున 4 లక్షల మంది చొప్పున ఫాలోయర్లు పెరగగా, అదే సంవత్సరం ఆగస్టులో ఎనిమిది రోజులపాటు తన ఖాతా సస్పెండ్ అయిన తర్వాత ఫాలోయర్ల పెరుగుదల నిలిచిపోయిందని తెలిపారు. ఇదే సమయంలో తాను ఢిల్లీలో ఓ అత్యాచార బాధితురాలి కుటుంబం అనుభవిస్తున్న ఆవేదనపై నిలదీశానని, రైతులకు సంఘీభావంగా నిలిచానని, ప్రభుత్వంతో అనేక మానవ హక్కుల ఉల్లంఘనలపై పోరాడానని తెలిపారు. భారత దేశంలో ఇటీవలి కాలంలో రాజకీయ నేతలు పోస్ట్ చేసిన వీడియోలలో చాలా ఎక్కువ మంది చూసినవాటిలో ఒకటి తన వీడియో అని తెలిపారు.

ట్విటర్ ఇండియాలోని వ్యక్తుల ద్వారా తనకు విశ్వసనీయ సమాచారం అందినట్లు పేర్కొన్నారు. తన గళాన్ని మూగబోయేలా చేయాలని ప్రభుత్వం నుంచి వారిపై అత్యంత తీవ్రమైన ఒత్తిడి ఉన్నట్లు చెప్పారన్నారు. తన ఖాతాను కొద్ది రోజులపాటు బ్లాక్ చేశారని తెలిపారు. తాను పోస్ట్ చేసిన ఫొటోలవంటివాటినే పోస్ట్ చేసిన ట్విటర్ హ్యాండిల్స్ చాలా ఉన్నాయని, వీటిలో ప్రభుత్వ వర్గాలకు చెందిన ఖాతాలు కూడా ఉన్నాయని తెలిపారు. అయితే ఆ ఖాతాలను బ్లాక్ చేయలేదన్నారు. కేవలం తన ఖాతాను మాత్రమే టార్గెట్ చేశారని తెలిపారు. రాహుల్ లేఖ‌పై ట్విటర్ కూడా స్పందించింది. ప్లాట్‌ఫాంను మానిప్యులేషన్, స్పామ్‌ చేయడాన్ని ఎంత మాత్రం సహించేది లేదన్నారు. తాము స్పామ్, మాలిషియస్ ఆటోమేషన్‌లపై వ్యూహాత్మకంగా పోరాడుతున్నట్లు తెలిపారు. మెషిన్ లెర్నింగ్ టూల్స్‌ను భారీగా వినియోగించి వీటిపై పోరాడుతున్నామన్నారు. ఆరోగ్యకరమైన సేవలు అందేవిధంగానూ, విశ్వసనీయమైన ఖాతాలు ఉండేవిధంగానూ తాము నిలకడగా చేపడుతున్న చర్యల వల్ల ఫాలోయర్ కౌంట్స్ మారుతుండవచ్చ‌న్నారు. అయితే రాహుల్ ఆరోప‌ణ‌ల‌ను తోసిపుచ్చింది.

Next Story
Share it