Telugu Gateway
Politics

రాహుల్ రెడీ...అధ్యక్ష్య బాధ్యతలు ఆయనకే!

రాహుల్ రెడీ...అధ్యక్ష్య బాధ్యతలు ఆయనకే!
X

ఎవరెన్ని చెప్పినా పార్టీ అధ్యక్ష్య బాధ్యతలు తీసుకోవటానికి ఇంతకాలం ససేమిరా అంటూ వచ్చిన రాహుల్ గాంధీ మెత్తపడినట్లు కన్పిస్తోంది. శనివారం నాడు ఢిల్లీలో సోనియాగాంధీ అధ్యక్ష్యతన జరిగిన అసమ్మతి నేతల సమావేశంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. అందరూ కోరుకుంటే పార్టీ కోసం పని చేయటానికి తాను రెడీ అని రాహుల్ గాంధీ స్పష్టంగా ప్రకటించినట్లు సమావేశం అనంతరం సీనియర్ నేత పవన్ బన్సల్ వెల్లడించారు. ఎవరు కూడా ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించలేదన్నారు. కొత్త సంవత్సరంలో రాహుల్ గాంధీ అధ్యక్ష్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు ఐదు గంటలపాటు కొనసాగిన అసమ్మతి నేతల సుదీర్ఘ సమావేశంలో 19 మంది నాయకుల అభిప్రాయాలు ఆమె అడిగి తెలుసుకున్నారు. వారి సూచనలు, సలహాలు స్వీకరించారు. పార్టీని బలోపేతం చేసే అంశాలపై ఎంపీ రాహుల్‌ గాంధీ ఈ సందర్భంగా ప్రసంగించారు.

ఈ క్రమంలో రాహుల్‌ నాయకత్వంపై తమకు అభ్యంతరం లేదని అసమ్మతి నేతలు వెల్లడించినట్లు సమాచారం. అదే విధంగా.. వివిధ రాష్ట్రాలలో పార్టీ పరిస్థితులపై కూడా చర్చించారు. పీసీసీల నాయకత్వ మార్పు, పార్టీ సంస్థాగత ఎన్నికల తదితర అంశాలపై కూలంకుశంగా చర్చించారు. ఇదిలా ఉండగా... చింతన్ బైఠక్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయి చర్చ జరపాలని మరికొందరు నేతలు అభిప్రాయపడ్డారు. భేటీ అనంతరం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పవన్‌ కుమార్‌ బన్సల్‌ మాట్లాడుతూ.. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడానికి గల కారణాలపై చర్చించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద కుటుంబం అని, నాయకులంతా అందులో సభ్యులేనని సోనియాగాంధీ అన్నట్లు పేర్కొన్నారు. ''దేశవ్యాప్తంగా పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి. త్వరలో జరగబోయే సంస్థాగత ఎన్నికల తర్వాత నాయకత్వ మార్పుపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని తెలిపారు.

Next Story
Share it