Telugu Gateway
Politics

ఉస్మానియాకు రాహుల్..నిర్ణ‌యం వీసీదే

ఉస్మానియాకు రాహుల్..నిర్ణ‌యం వీసీదే
X

కాంగ్రెస్ అగ్ర‌నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివ‌ర్శిటీలో విద్యార్ధుల‌తో త‌ల‌పెట్టిన స‌మావేశం విష‌యంలో జోక్యం చేసుకోలేమ‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది. దీంతో రాహుల్ ఉస్మానియా ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి గ‌త కొన్ని రోజులుగా సాగుతున్న గంద‌ర‌గోళం కొన‌సాగే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి. రాహుల్ ప‌ర్య‌ట‌న‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని తెలంగాణ కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి చాలా ముందుగానే యూనివ‌ర్శిటీ అధికారుల‌కు విన‌తిప‌త్రం అంద‌జేశారు. దీనికి కౌంట‌ర్ గా అధికార టీఆర్ఎస్ కు చెందిన విద్యార్ధి విభాగం కూడా అనుమ‌తి ఇవ్వ‌వ‌ద్ద‌ని వినతిప‌త్రం అంద‌జేసింది. త‌ర్వాత యూనివ‌ర్శిటీ యాజ‌మాన్యం రాహుల్ ప‌ర్య‌ట‌న‌కు నో చెప్ప‌టంతో కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్ర‌యించింది. ఈ అంశాన్ని విచారించిన హైకోర్టు ధ‌ర్మాసనం సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాల‌కే మొగ్గుచూపింది. ఈ విష‌యంలో నిర్ణ‌యాన్ని ఉస్మానియా యూనివ‌ర్శిటీ వైస్ ఛాన్స‌ల‌ర్ కే వ‌దిలేసింది. దీంతో ఆయ‌న అనుమ‌తి ఇవ్వ‌టం జ‌రిగే ప‌నికాద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. కాంగ్రెస్ నేత‌లు మాత్రం ఖ‌చ్చితంగా రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివ‌ర్శిటీని సంద‌ర్శించి తీర‌తార‌ని చెబుతూ వ‌స్తున్నారు. మ‌రి మే 7న హైద‌రాబాద్ లో ఎలాంటి ప‌రిణామాలు చోటుచేసుకుంటాయో వేచిచూడాల్సిందే. వాస్త‌వానికి గ‌తంలో ఉస్మానియా యూనివ‌ర్శిటీలో ఎన్నో రాజ‌కీయ , రాజ‌కీయేత‌ర స‌మావేశాలు జ‌రిగాయి.

కేవలం విద్యార్ధుల స‌మ‌స్య‌లు విన‌టానికి మాత్ర‌మే రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివ‌ర్శిటీకి వ‌స్తున్నార‌ని కాంగ్రెస్ పార్టీ తర‌పు న్యాయ‌వాది కోర్టుకు వివ‌రించారు. అయితే యూనివ‌ర్శిటీ అధికారులు మాత్రం ప‌రీక్షలు జ‌రుగుతున్నాయ‌ని..శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని చెప్పి అనుమ‌తి నిరాక‌రించిన విష‌యం తెలిసిందే. రాహుల్ గాంధీ ఈ నెల 6,7 తేదీల్లో ప‌ర్య‌టించ‌నున్న విష‌యం తెలిసిందే. తొలి రోజు వ‌రంగ‌ల్ లో రైతు సంఘ‌ర్ష‌ణ పేరుతో స‌భ‌ను నిర్వ‌హించ‌నున్నారు. కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ స‌భ‌ను నిర్వ‌హించాల‌ని త‌ల‌పెట్టాల‌ని నిర్ణ‌యించింది. ఇందుకు భారీ ఎత్తున జ‌న‌సమీక‌ర‌ణ చేసేలా స‌న్నాహాలు చేశారు. మ‌రుస‌టి రోజు అంటే మే 7న హైద‌రాబాద్ లో ఉస్మానియా యూనివ‌ర్శిటీలో విద్యార్ధుల‌తో స‌మావేశం కావ‌టంతోపాటు..మ‌రికొన్ని స‌మావేశాల్లో పాల్గొనాల‌ని నిర్ణ‌యించారు. అయితే హైకోర్టు ఈ పిటీష‌న్ ను డిస్మిస్ చేసింది. తొలుత రాహుల్ ప‌ర్య‌ట‌న‌కు అనుమ‌తి ఇచ్చిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే త‌ర్వాత ఇందులో నిజంలేద‌ని తేలింది.

Next Story
Share it