Telugu Gateway
Politics

దుమారం రేపిన రాహుల్ స్పీచ్

దుమారం రేపిన రాహుల్ స్పీచ్
X

కేంద్ర బడ్జెట్ పై లోక్ సభ లో ప్రతిపక్ష నేత గా రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం దుమారం రేపింది. దీనికి ప్రధాన కారణం ఆయన చేసిన ఏ1 , ఏ 2 వ్యాఖ్యలే. కేంద్ర బడ్జెట్ సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదు అని..ఇది కేవలం అదానీ, అంబానీ వంటి వాళ్లకు మాత్రమే ఉపయోగపడేలా ఉంది అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో లేని వాళ్ళ పేర్లు చెప్పటం సరికాదు అని..లేదా వాళ్లపై ఏదైనా మాట్లాడాలి అంటే ముందు లిఖితపూర్వకంగా తెలియచేయాలని కోరారు. దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ ఖచ్చితంగా వాళ్ళ గురించి చెప్పక తప్పదు అంటూ...వాళ్ళను ఎలా సంభోదించాలో మీరే చెప్పాలి అంటూ స్పీకర్ ను కోరారు. తర్వాత రాహుల్ గాంధీ వాళ్ళను ఏ1 , ఏ2 లు సంబోధిస్తూ ఇది ఓకేనా అంటూ ప్రశ్నించారు. తర్వాత కూడా రాహుల్ గాంధీ తన స్పీచ్ లో పలు మార్లు ఈ ప్రస్తావన చేశారు. కేంద్ర విధానాలతో ఎయిర్ పోర్ట్ లు, పోర్ట్ ల తో పాటు పలు రంగాల్లో కొన్ని కంపెనీల గుత్తాధిపత్యం వస్తోంది అని విమర్శలు గుప్పించారు.

మధ్యలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజ్ జోక్యం చేసుకోగా..తాను అర్ధం చేసుకోగలనని...ఆయన అంబానీ..ఆదానీలను సేవ్ చేయాల్సి ఉంటుంది అంటూ ఐయామ్ సారీ ఏ 1 , ఏ 2 లను అంటూ కామెంట్ చేశారు. రాహుల్ గాంధీ బడ్జెట్ పై మాట్లాడిన సమయంలో అధికార బీజేపీ సభ్యుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కాగా...ప్రతిపక్షాలు సైతం దీన్ని గట్టిగానే ఎదుర్కొన్నాయి. ఇప్పుడు దేశంలో పద్మవ్యూహం లాంటి కమలం పార్టీ అధికారంలో ఉందని, అందుకే రైతులు భయపడుతున్నారని అన్నారు. మహాభారతంలో పద్మవ్యూహాన్ని ఆరుగురు నియంత్రిస్తే.. ఇప్పుడు మోదీ, అమిత్ షా, మోహన్ భగవత్, అజిత్ దోవల్, అంబానీ, అదాని లాంటి వారు కంట్రోల్ చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగం, పేపర్ లీక్ లు పెద్ద సవాళ్లుగా ఉన్నాయని అన్నారు. అగ్నివీర్‌ల పెన్షన్‌కు బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని, మధ్యతరగతిని పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం మద్దతు ధర ఇవ్వాలని రైతులు చాలాకాలం నుంచి అడుగుతున్నారని.. కానీ బడ్జెట్‌లో దాని ప్రస్తావనే లేదని మండిపడ్డారు.

Next Story
Share it