Telugu Gateway
Politics

రాహుల్...తొలి అడుగు ప‌డింది

రాహుల్...తొలి అడుగు ప‌డింది
X

కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన భార‌త్ జోడో యాత్రలో ఆ పార్టీ నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ తొలి అడుగు ప‌డింది. దేశాన్ని విభ‌జ‌న శ‌క్తుల నుంచి స‌మైక్యంగా ఉంచేందుకే ఈ యాత్ర చేప‌డుతున్న‌ట్లు రాహుల్ గాంధీ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అందులో భాగంగా ఆయ‌న గురువారం నాడు క‌న్యాకుమారిలో భార‌త్ జోడో యాత్ర ప్రారంభించారు. బుధ‌వారం సాయంత్రమే లాంఛ‌నంగా ఈ కార్య‌క్ర‌మం ప్రారంభం అయినా అస‌లైన యాత్ర మాత్రం గురువారం నాడు ప్రారంభం అయింది. రాహుల్ గాందీతోపాటు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు కూడా ఇందులో పాల్గొంటున్నారు. రాహుల్ గాంధీ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు వింటూ ముందుకు సాగుతున్నారు. 2017లో ఆత్మ‌హ‌త్య చేసుకున్న నీట్ అభ్య‌ర్ధిని అనిత కుటుంబాన్ని పరామ‌ర్శించి..వారి కుటుంబాన్ని ఓదార్చారు.

3570 కిలోమీట‌ర్ల మేర ఈ భార‌త్ జోడో యాత్ర సాగ‌నుంది. క‌న్యాకుమారి నుంచి కాశ్మీర్ వ‌ర‌కూ రాహుల్ గాంధీ యాత్ర చేయ‌నున్న‌ట్లు చాలా రోజుల కింద‌టే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ యాత్ర‌పై కాంగ్రెస్ పార్టీ భారీ ఆశలే పెట్టుకుంది. త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న క‌ర్ణాట‌క‌, తెలంగాణ రాష్ట్రాల‌ను రాహుల్ గాంధీ వెంట‌నే క‌వ‌ర్ చేసేలా టూర్ ను డిజైన్ చేశారు. ఈ యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీలో ఖ‌చ్చితంగా జోష్ వ‌స్తుంద‌నే అభిప్రాయం ఆ పార్టీ నేత‌ల్లో వ్య‌క్తం అవుతోంది. 2024 ఎన్నిక‌లే టార్గెట్ గా ఈ యాత్ర కొన‌సాగ‌నుంది. దేశంలో కాంగ్రెస్ తోపాటు కాంగ్రెసేత‌ర పార్టీలు కూడా కేంద్రం నుంచి ప‌లు మార్గాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీనిపై పార్టీల‌న్నీ మోడీ స‌ర్కారును తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి.

Next Story
Share it