వివాదంలో రాహుల్ గాంధీ..నైట్ క్లబ్ పార్టీ వీడియో వైరల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన విదేశీ పర్యటనలు ఎప్పుడూ వివాదస్పదం అవుతూనే ఉంటాయి. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంతోపాటు..కీలక సమయాల్లో ఆయన విదేశీ పర్యటనలు చేయటంపై సొంత పార్టీ నేతలు కూడా ఒకింత అసహనం వ్యక్తం చేసిన సందర్బాలు ఉన్నాయి. ఇక బిజెపి అయితే నేరుగానే దీనిపై విమర్శలు చేస్తుంది. తాజాగా రాహుల్ గాంధీ నేపాల్ పర్యటన తాజా వివాదానికి కారణమైంది. నేపాల్ రాజధాని ఖాట్మాండులోని ఓ నైట్ క్లబ్‌లో రాహుల్ గాంధీ కనిపించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీజేపీ ఐటీ ఇన్‌చార్జి అమిత్ మాలవియాతో పాటు పలువురు నేతలు ఈ వీడియో ఆధారంగా కాంగ్రెస్ నేతపై, ఆ పార్టీ విధానాలను టార్గెట్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ విమర్శలను తిప్పికొడుతోంది. రాహుల్ తన జర్నలిస్ట్ ఫ్రెండ్ అయిన సుమ్నీమా ఉదాస్ వివాహ వేడుక కోసం సోమవారం రాహుల్ గాంధీ ఖాట్మాండు వెళ్లారు.
అక్కడ స్నేహితులతో కలిసి ఖాట్మాండ్‌లోని మారియట్ హోటల్‌లో బస చేశాడు. ఈ విషయాన్ని సుమ్నీమా తండ్రి భూమ్ ఉదాస్ ధృవీకరించారు కూడా. భూమ్ ఉదాస్.. మయన్మార్‌లో నేపాల్ అంబాసిడర్‌గా ఉన్నారు.ఈ వివాహ వేడుక తరుణంలోనే ఆయన నైట్ పార్టీకి హాజరై ఉండొచ్చని చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల యూరప్ దేశాల పర్యటనను లక్ష్యంగా చేసుకుని.. కాంగ్రెస్ 'దేశంలో తీవ్ర సంక్షోభంలో ఉంటే.. సారు విదేశాల్లో ఉండడమే ఇష్టపడుతున్నారు'' అంటూ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఈ తరుణంలో రాహుల్ నేపాల్ టూర్‌పై ఇప్పుడు బీజేపీ విమర్శలకు ఓ అస్త్రంగా మార్చుకుంది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఈ వీడియో వివాదంపై స్పందించారు. పెళ్ళికిపోవటం కూడా తప్పేనా అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ అకస్మాత్తుగా పాకిస్తాన్ వెళ్ళి నవాజ్ షరీప్ ను కలిసొచ్చారని..ఆ తర్వాత భారత్ పై దాడి జరిగిందని అంటూ ఎదురుదాడికి దిగారు.