పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా
అనూహ్యం. ఒకసారి ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ మారటం చాలా అరుదు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సోమవారం నాడు అత్యంత కీలకమైన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో మాత్రం అదే జరిగింది. అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు ప్రధాన పార్టీలు అన్నీ కూడా ఎన్నికల వాయిదాను కోరాయి. దీంతో సీఈసీ కూడా అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. దీంతో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 20కి వాయిదా పడ్డాయి. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇవి ఫిబ్రవరి 14న జరగాల్సి ఉంది. గురు రవిదాస్ జయంతి వేడుకల దృష్ట్యా ఎన్నికలను వాయిదా వేయాలని పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ తొలుత కోరారు. లేదంటే చాలా మంది ఓటు హక్కును వినియోగించుకోలేరని తెలిపారు.
ఇతర రాజకీయ పార్టీలు కూడా ఇదే అభ్యర్థన చేశాయి. దీంతో గురు రవిదాస్ జయంతి వేడుకల దృష్ట్యా అసెంబ్లీ ఎన్నికలను ఫిబ్రవరి 20 వరకు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. కొత్త షెడ్యూల్ ప్రకారం.. జనవరి 25న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, నామినేషన్లకు ఫిబ్రవరి 1 తుది గడువు, నామినేషన్ల పరిశీలనకు తుది గడువు ఫిబ్రవరి 2, నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి గడువు ఫిబ్రవరి 4, ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 20న, ఓట్ల లెక్కింపు మార్చి 10న జరగనుంది. అయితే తొలుత షెడ్యూల్ ప్రకటించే సమయంలో ఎస్ఈసీ ఇంతటి కీలక విషయాలను ఎలా విస్మరించిందనే విమర్శలు విన్పిస్తున్నాయి. సహజంగా సీఈసీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించే సమయంలో స్థానిక పండగలతోపాటు పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి.