యూపీలో పని చేయని 'ప్రియాంక మ్యాజిక్'

ఆ పని కూడా అయిపోయింది. ప్రియాంక గాంధీ రంగంలోకి దిగితే కాంగ్రెస్ పరిస్థితుల్లో భారీ మార్పు వస్తుందని చాలా మంది ఊహించారు. కానీ ప్రియాంక గాంధీ మ్యాజిక్ కూడా ఏ మాత్రం పని చేయలేదని తాజాగా వెల్లడవుతున్న ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ప్రియాంక గాంధీ తన శక్తివంచన లేకుండా యూపీలో భారీ ఎత్తున ప్రచారం చేశారు. అంతే కాదు..ముఖ్యంగా మహిళలను ఆకట్టుకునేలా సీట్లలో కూడా అత్యధిక శాతం మహిళలకే ఇస్తూ ఓ కొత్త ప్రయోగానికి కూడా శ్రీకారం చుట్టారు. అయినా కూడా ఆశించిన ఫలితాలు ఏమీ రాలేదు. అయితే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ యూపీలో ఏదో అద్భుతాలు సాధిస్తుందని ఎవరూ భావించలేదు. కానీ ప్రియాంక గాంధీ రాకతో గౌరవప్రదమైన సీట్లు అయినా వస్తాయని చాలా మంది ఆశించారు. కానీ అది కూడా జరగలేదు. దీంతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ రాజకీయ భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్టానం గత కొన్నేళ్ళుగా స్తబ్దుగా ఉండటం..పూర్తి స్థాయి ప్రెసిడెంట్ లేకుండా తాత్కాలిక ప్రెసిడెంట్ తో నడిపిస్తుండటంతో యూపీలో ఉన్న కాస్తో కూస్తో కీలక నేతలు కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు.
దీంతో రాజకీయంగా అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రంలో కీలక నేతలు ఎవరూ లేకపోవటం ఆ పార్టీకి పెద్ద మైనస్ గా మారింది. ప్రియాంక గాంధీతోపాటు రాహుల్ కూడా ఉత్తరప్రదేశ్ లో పర్యటించారు. అనారోగ్య కారణాల వల్ల సోనియాగాంధీ అసలు ఈ సారి ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. ఒక్క యూపీలోనే కాదు అధికారంలో ఉన్న పంజాబ్ లోనూ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాభవాన్ని మూటకట్టుకుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కచోట అంటే ఒక్క చోట కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేకుండా పోవటంతో పార్టీ అధిష్టానంపై సీనియర్ నేతల దాడి మరింత పెరిగే అవకాశం కన్పిస్తోంది. అంతే కాదు..చాలా మంది కీలక నేతలు పార్టీని కూడా వీడటం ఖాయంగా భావిస్తున్నారు.
మరి ఈ పరిస్థితిని సోనియా, రాహుల్, ప్రియాంకలు ఎలా చక్కదిద్దుతారో వేచిచూడాల్సిందే. ఈ పరిణామాలు అన్నీ ఈ ఏడాది చివరిలో జరగనున్న గుజరాత్ ఎన్నికలు, వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కేంద్రంలోని మోడీ సర్కారు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు తెచ్చి ఉపసంహరించుకున్నా..యూపీలో రైతులపై కేంద్ర మంత్రి కుమారుడు రైతులను కారుతో తొక్కించి చంపినా కాంగ్రెస్ వీటిని రాజకీయంగా వాడుకోవటంలో విఫలమైందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.