Telugu Gateway
Politics

ప్రశ్న ఏదైనా...మోడీ సమాధానం ఆయన ఇష్టం!

ప్రశ్న ఏదైనా...మోడీ సమాధానం ఆయన ఇష్టం!
X

ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఒక సబ్జెక్టు. అలాగే భారత ప్రధాని మోడీది ఆర్ట్ ఆఫ్ ఎస్కేపింగ్. ఇందులో నరేంద్ర మోడీ మాస్టర్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎవరు ఏమి అనుకున్నా...పార్టీలు ఎంత అరిచి గీ పెట్టినా అయన మాత్రం తన లైన్ దాటరు. మణిపూర్ మంటలపై ప్రధాని మోడీ తో మాట్లాడించాలి అని విపక్షాలు అన్నీ ఒక్కటై అవిశ్వాస తీర్మానం పెట్టినా కూడా వాళ్ళు అనుకున్న లక్ష్యం సాధించలేకపోయారు అనే చెప్పాలి. ఎందుకంటే అవిశ్వాస తీర్మానంపై చర్చకు సమాధానం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ రెండు గంటలకు పైగా మాట్లాడారు. అందులో అయన మణిపూర్ ఇష్యూ కు అతి తక్కువ ప్రాధాన్యత ఇచ్చారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. త్వరలోనే అక్కడ శాంతి నెలకొంటుంది..కోర్టు తీర్పు కూడా అల్లర్లకు కారణం అయింది వంటి మాటలు చెప్పారు తప్ప మణిపూర్ లోని సమస్య తీవ్రతకు అనుగుణంగా మోడీ స్పందించలేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అవిశ్వాస తీర్మానంపై చర్చలో అయన తన సమయాన్ని అంతా కాంగ్రెస్ పార్టీ పై ఎటాక్ చేయటానికే వాడుకున్నారు. సహజంగా అవిశ్వాస తీర్మానంలో పార్టీలకు అన్ని అంశాలపై మాట్లాడే వెసులుబాటు ఉంటుంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఫోకస్ అంతా మణిపూర్ అల్లర్లపైనే పెట్టింది. ఇతర ప్రతిపక్షాలు కూడా అదే పని చేశాయి. కానీ మోడీ మాత్రం తన సమాధానంలో మణిపూర్ అంశానికి అతి తక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మోడీ ఏమి మాట్లాడాలి అనేది పూర్తిగా అయన ఛాయిస్ అయినా కూడా ఒక రాష్ట్రంలో పరిస్థితి అంతా దారుణంగా ఉంటే ఒక ప్రధాని స్పందించే తీరు ఇదేనా అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఒక్క మణిపూర్ ఇష్యూ లోనే కాదు కొద్ది నెలల క్రితం దేశ కార్పొరేట్ రంగాన్ని కుదిపేసిన అదానీ-హిండెన్ బర్గ్ ఎపిసోడ్ లో కూడా ప్రధాని మోడీ తీరు తీవ్ర విమర్శల పాలు అయింది. అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ రిపోర్ట్ బయటికి వచ్చిన తర్వాత దేశ స్టాక్ మార్కెట్లు కుప్పకూలగా..అదానీ షేర్లలో పెట్టుబడి పెట్టిన వారు భారీగా నష్టపోయారు. అయినా సరే మోడీ మాత్రం ఇప్పటివరకు ఈ అంశంపై నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడలేదు. ప్రధాని మోడీ-అదానీల మధ్య గాఢమైన సంబంధాలు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ తీరు ఎలా ఉంది అంటే ప్రశ్న ఏదైనా...జవాబు మాత్రం ప్రశ్నతో సంబంధం లేకుండా తాను చెప్పాలనుకున్నదే చెపుతారని...ఇప్పటికే ఇది పలు మార్లు స్పష్టం అయింది అని చెపుతున్నారు. అందుకే ఆయన్ను ఆర్ట్ అఫ్ ఎస్కేపింగ్ లో మాస్టర్ అంటూ ప్రస్తావిస్తున్నారు. మోడీ తీరుపై శుక్రవారం నాడు మీడియా తో మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తాను ఎంతో మంది ప్రధానులను చూశాను కానీ ..ఇలా దిగజారి మాట్లాడిన ప్రధాని ని చూడలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని దేశ ప్రజలందరి ప్రతినిధి అని..అయన ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడకూడదు అన్నారు.

Next Story
Share it