జులై 18న రాష్ట్రపతి ఎన్నిక
దేశంలో అత్యంత కీలకమైన రాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధం అయింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికకు షెడ్యూల్ ప్రకటించింది. ప్రస్తుత బలాబలాల ప్రకారం చూస్తే కేంద్రంలోని ఎన్డీయే సర్కారు ప్రతిపాదించిన అభ్యర్ధికే గెలుపు అవకాశాలు బలంగా ఉన్నాయి. అయితే ఈ పార్టీకి అవసరమైన దాని కంటే కాస్త తక్కువ బలం ఉన్నా..ఏపీకి చెందిన వైసీపీ, ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్ వంటి పార్టీల మద్దతుతో తన అభ్యర్దిని గెలిపించుకోవటం పెద్ద కష్టం కాబోదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోడీతోపాటు మరికొంత మంది నేతలు రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి చర్చలు ప్రారంభించి ప్రభుత్వం ప్రతిపాదించే అభ్యర్ధికి అనుకూలంగా ఓట్లు పొందే ప్రయత్నం ప్రారంభించారు. అయితే ఇక్కడ అత్యంత కీలకం దేశంలోని ప్రతిపక్ష పార్టీలు అసలు అభ్యర్ధిని బరిలో దింపుతాయా లేదా అన్నది వేచిచూడాల్సిందే. ఇప్పటివరకూ అయితే ఈ దిశగా ఎక్కడా ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవు.
అదే కాకుండా ప్రాంతీయ పార్టీల మధ్య ఈ అంశంతో ఏకాభిప్రాయం రావటం అనేది అత్యంత కీలకం అవుతుంది. అదే సమయంలో ఓడిపోయే సీటులో నిలబడటానికి ఎవరు ముందుకు వస్తారు అన్నది కూడా కీలకంగా మారనుంది. ఇదిలా ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం గురువారం సాయంత్రం రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. దీని ప్రకారం ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. జులై 18న ఎన్నిక జరగనుంది. జులై 21న ఫలితాలు వెల్లడిస్తారు. నామినేషన్లకు జూన్ 29 చివరి తేదీ. నామినేషన్ల ఉపసంహరణకు జులై రెండు చివరి తేదీగా నిర్ణయించారు. ఎలక్టోరల్ పద్ధతిలో రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల విలువ 10, 98, 903 కాగా 2, 34, 680 ఓట్లు పొందిన అభ్యర్ధి రాష్ట్రపతిగా ఎన్నిక అవుతారు. ప్రస్తుత రాష్ట్రపతి పదవీకాలం జులై 24న ముగియనుంది. దీంతో కొత్త రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ వచ్చే నెల 24లోపే పూర్తి కావాల్సి ఉంటుందని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.