కారు కింద పడతారో..ఏనుగు ఎక్కుతారో తేల్చుకోండి
కెసీఆర్ ఆస్తులమ్మీ దళిత బంధు అమలు చేయాలి
బీఎస్పీలో చేరిన మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రి కెసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బహుజన సమాజంలో బానిసలు ఎవరూ ఉండరని..అందరూ పాలకులే అన్నారు. నల్లగొండలో జరిగిన బహుజన రాజ్యాధికార సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ ప్రసంగిస్తూ దళిత బంధు కోసం 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని అంటున్నారు.. ఆ డబ్బులు ఎవరివని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. దళితులపై ప్రేమ ఉంటే కేసీఆర్ తన ఆస్తులు అమ్మి దళితబంధు అమలు చేయాలన్నారు. తెలంగాణలో ఇప్పటివరకు సీఎం కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. ఇన్నేళ్లలో తెలంగాణలో ఎన్ని ఆస్పత్రులు కట్టారు? ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఎందుకు ఉండకూడదు? అని ప్రశ్నించారు. ఇప్పటివరకు సంపద మొత్తం 5 శాతం వర్గాల వద్దే ఉందన్నారు.
ప్రవీణ్‌కుమార్ ఆదివారం బహుజన్ సమాజ్ వాదీ పార్టీలో చేరారు. బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ రాంజీ గౌతమ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఆ వెంటనే బీఎస్పీలో చేరిన ప్రవీణ్‌కుమార్ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా నియమించారరు. దళితుల బతుకులు బాగు పడాలంటే విద్య, ఉపాధి కావాలని తెలిపారు. తాను రాజీనామా చేసిన రోజే కేసుపెట్టారని చెప్పారు. ఎన్ని కుట్రలు చేసిన జన సునామీని ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు.ఈ సమావేశానికి ఎన్నో అడ్డంకులు కల్పించారని..ఎంత మందికి ఇలా చేయగలరని ప్రశ్నించారు. కారు కింద పడతారా.. ఏనుగెక్కుతారా? తేల్చుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ విచ్చల విడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నారెందుకు? అని ప్రశ్నించారు. ఆ డబ్బులు.. గిరిజన బిడ్డలు వ్యవసాయం చేసి.. ఆదివాసీ బిడ్డలు అడవుల్లో నుంచి తేనె సేకరించి సంపాదించిన డబ్బులేనని తెలిపారు.