కాంగ్రెస్ హ్యాండిచ్చిన ప్రశాంత్ కిషోర్

గేమ్ ఓవర్. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చారు. ఆ పార్టీలో చేరటానికి ఆయన నిరాకరించినట్లు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా నిర్ధారించింది. కొద్ది రోజుల క్రితం 2024 ఎన్నికలకు సంబంధించి ఆయన కాంగ్రెస్ అధిష్టానానికి ఓ ప్రజంటేషన్ ఇచ్చారు. దీనిపై ఆగమేఘాల మీద స్పందించిన కాంగ్రెస్ అధిష్టానం ఓ వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేసి చకచకా నిర్ణయాలు తీసుకుంది. 2024 ఎన్నికలకు సంబంధించి సాధికార గ్రూపును ఒకటి ఏర్పాటు చేసి..నిర్దేశిత బాధ్యతలతో అందులో చేరాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆయన్ను ఆహ్వానించగా..పీకె అందుకు నిరాకరించినట్లు రణ్ దీప్ సూర్జేవాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
పార్టీకి ఇచ్చిన సలహాలు...సూచనలపై ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ లో చేరాలంటే ఇప్పటికే టీఆర్ఎస్, వైసీపీ, టీఎంసీలతో ఒప్పందాలను రద్దు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీలోని చాలా మంది సీనియర్లు సూచించగా..కాంగ్రెస్ అధిష్టానం కూడా దీనిపై పట్టుబట్టింది. ఆయితే ఆయన సలహాదారుగానే కొనసాగాలని నిర్ణయించుకుని..కాంగ్రెస్ లో చేరటానికి నిరాకరించారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి ఆయన యాక్షన్ ప్లాన్ కూడా ఇచ్చారు. కానీ కారణాలేంటో తెలియదు కానీ పీకె కాంగ్రెస్ కు దూరం జరిగారు. ప్రశాంత్ కిషోర్ వరసగా పలుమార్లు సోనియాగాంధీతో భేటీ అవటంతో ఆయన కాంగ్రెస్ లో చేరిక అంతా పక్కా అనుకున్నారు.