Telugu Gateway
Politics

పీకె పాద‌యాత్ర‌..ప్ర‌స్తుతానికి నో పార్టీ

పీకె పాద‌యాత్ర‌..ప్ర‌స్తుతానికి నో పార్టీ
X

దేశంలోని ప్ర‌ముఖ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ త‌న పొలిటిక‌ల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. గ‌త కొన్ని రోజులుగా ఆయ‌న పార్టీ పెట్ట‌బోతున్న‌ట్లు భారీ ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. అందుకు ఊతం ఇచ్చేలా ఆయ‌న ట్వీట్ కూడా ఉండ‌టంతో అంద‌రిలోనూ దీనిపై ఆస‌క్తి ఏర్ప‌డింది. అయితే పీకె గురువారం నాడు మీడియా ముందుకు వ‌చ్చి త‌న ప్ర‌ణాళిక‌ల‌ను వివ‌రించారు. 'నా సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని బీహార్‌ కోసం ఉపయోగిస్తాను. లాలూ, నితీష్ పరిపాలనలో బీహార్ అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా మిగిలిపోయింది. రాబోయే పది-పదిహేను ఏళ్లలో బీహార్ ప్రగతిశీల రాష్ట్రంగా ఎదగాలంటే ఇప్పుడున్న దారిలో వెళితే సాధ్యం కాదు. కొత్త ఆలోచన, కొత్త ప్రయత్నం ద్వారానే ఇది సాధ్యం. ప్రజలంతా కలసికట్టుగా అడుగు ముందుకేస్తే ఇప్పుడున్న పరిస్థితుల నుంచి బయటపడతాం. ఎలాంటి రాజకీయ పార్టీ, రాజకీయ వేదికను నేను ఇప్పుడు ప్రకటించను. 'జన్ సురాజ్' కోసం రాబోయే 3, 4 నెలలో అందరినీ కలిసి మాట్లాడుతాను.

నా అభిప్రాయంతో కలిసి వచ్చే వారిని నా ఉద్యమంలో చేర్చుకుంటాను. నేను రాజకీయ పార్టీ పెడితే అది కేవలం ప్రశాంత్ కిషోర్ పార్టీ కాదు, అందరి పార్టీగా ఉంటుంది. రాజకీయ పార్టీపై ఈరోజు ఎలాంటి ప్రకటన చేయటం లేదు. గాంధీ జయంతి నుంచి బీహార్‌లో పాదయాత్ర ప్రారంభిస్తాను. అ​క్టోబర్‌ నుంచి 3 వేల కిలోమీటర్లు వరకు పాదయాత్ర కొనసాగిస్తాను. వచ్చే 3, 4 నెలల్లో 17 వేల మందిని కలుస్తాను. బీహార్‌లో పాదయాత్ర చేసి ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటాను. 4 నెలల పాటు ప్రజలతో మమేకం అవుతాను. బీహార్‌ అభివృద్ధి కోసం ప్రయత్నిస్తాను'' అని స్ప‌ష్టం చేశారు. కాంగ్రెస్ లో చేర‌దామ‌ని ప్ర‌శాంత్ కిషోర్ చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. కాంగ్రెస్ పార్టీ ఆయ‌న‌కు ఇవ్వ‌చూపిన ప‌ద‌వి ఏ మాత్రం పీకె ఆశ‌ల‌కు అనుగుణంగా లేక‌పోవ‌టంతో ఆయన ఈ ప్ర‌తిపాద‌న‌ను తిర‌స్క‌రించారు. 2024 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెలుపున‌కు అవ‌స‌ర‌మైన వ్యూహాల‌తోపాటు భారీ ప్రజంటేష‌న్ ను కూడా కాంగ్రెస్ అగ్ర‌నేత‌ల‌కు పీకె ఇచ్చిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న కంపెనీ ఐప్యాక్ తెలంగాణ‌లో టీఆర్ఎస్ కు సేవ‌లు అందించ‌టానికి ఒప్పందం కుదుర్చుకున్న విష‌యం తెలిసిందే.

Next Story
Share it