Telugu Gateway
Politics

ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం

ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం
X

తాజాగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినా అందరి ఫోకస్ అంతా కూడా బెంగాల్ వైపే ఉంది. ఎందుకంటే బిజెపి అగ్రనేతలు..ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు అక్కడి ఎన్నికలపై అంతగా ఫోకస్ పెట్టారు. ఎలాగైనా ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఇంటికి పంపి..కాషాయ జెండా ఎగరేయాలనే లక్ష్యంగా చెమటోడ్చారు. కానీ వారి ప్రయత్నాలు పెద్దగా పలించలేదు. బిజెపి సీట్లు అయితే పెంచుకోగలిగింది కానీ..అధికారంలోకి రావాలనే ఆశను నెరవేర్చుకోలేకపోయింది. ఇదిలా ఉంటే మమతాకు రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల వ్యూహకర్త..పొలిటికల్ మేనేజ్ మెంట్ పేరు ఏదైనా ఇక తాను బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఐప్యాక్ లో ఉన్న టీమ్ తన కంటే మరింత మెరుగ్గా ఈ వ్యవహారాలు చూసుకుంటుందని వ్యాఖ్యానించారు. ఓ జాతీయ ఛానల్ తో మాట్లాడుతూ బెంగాల్‌ గెలిచింది.

చేయగిలినంత చేశాను.. ప్రస్తుతం కొంతకాలం బ్రేక్‌ తీసుకొని జీవితంలో ఇంకేమైనా చేయాలని భావిస్తున్నా అన్నారు. అయితే మళ్లీ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారా అని ప్రశ్నించినపుడు.. రాజకీయాల్లో తాను విఫలమయ్యానని పేర్కొన్నారు. 294 మంది సభ్యుల అసెంబ్లీలో బీజేపీ డబుల్‌ డిజిట్‌ దాటడం కూడా కష్టమే అంటూ ప్రశాంత్ కిషోర్ డిసెంబర్ 21 ట్వీట్ చేశారు. ఇది నిజం కాకపోతే ట్విట్టర్ వదిలేస్తానన్నారు. అయితే బిజెపి ఆయన చెప్పినట్లుగానే రెండు అంకెలకే పరిమితం అవుతోంది. అయితే విచిత్రంగా ఆయన ట్విట్టర్ వదిలేయటం సంగతి అలా ఉంచి ఏకంగా రాజకీయ వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి సంచలనానికి కారణం అయ్యారు.

Next Story
Share it