ప్రగతి భవన్ లో బస చేసిన తొలి వ్యక్తి పీకేనేనా?!

ప్రగతి భవన్. ముఖ్యమంత్రి కెసీఆర్ అధికారిక నివాసం. రాష్ట్రానికి అధికారికంగా....అనధికారికంగా ఎంత మంది వీవీఐపిలు వచ్చినా వారికి స్టార్ హోటళ్ళలో..అన్ని హంగులు..అర్భాటాలతో అతిథి మర్యాదలు చేస్తారు. ప్రొటోకాల్ ప్రకారం చూసుకుంటారు. అధికారంలో ఉన్నవారికి అవసరమైన వారు అయితే ఆ మర్యాదలు వేరుగా ఉంటారు...ఇతరులు అయితే జస్ట్ ప్రొటోకాల్ పాటిస్తారు..పంపిస్తారు. ప్రగతి భవన్ కట్టిన తర్వాత అక్కడ బస చేసిన బయటి వ్యక్తి బహుశా ప్రశాంత్ కిషోరే మొదటివారు అయి ఉండొచ్చనే చర్చ టీఆర్ఎస్ వర్గాలతోపాటు ఇతర పార్టీల్లోనూ జరుగుతోంది. శనివారం ఉదయం హైదరాబాద్ కు చేరుకున్న ప్రశాంత్ కిషోర్ రోజంతా అక్కడే టీఆర్ఎస్ అధినేత, సీఎం కెసీఆర్ తో చర్చలు జరిపారు. అది అంతా ఒకెత్తు అయితే ప్రగతి భవన్ లో నే ఆయన రాత్రి ఆయన బస చేసినట్లు మీడియాకు లీక్ లు ఇచ్చారు. అంటే పీకెను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నది చెప్పకనే చెప్పారు. దీని ద్వారా టీఆర్ఎస్ పలు ప్రయోజనాలు ఆశించినట్లు కన్పిస్తోంది.
ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ నేతలను కన్ఫ్యూజన్ లోకి నెట్టడం ఈ లీక్ వెనక ప్రధాన ఉద్దేశం. అసలే గందరగోళంలో ఉన్న ఆ పార్టీకి ఇది ఓ ఝలక్ వంటిదే. మరో విశేషం ఏమిటంటే ప్రశాంత్ కిషోర్ కు ఏమి సంబంధం ఉండదట..కానీ ఆయన కంపెనీ ఐప్యాక్ టీఆర్ఎస్ కు సేవలు అందిస్తుందని చెబుతున్నారు. అదే నిజం అయితే మరి ప్రశాంత్ కిషోర్ ఆగమేఘాల మీద హైదరాబాద్ చేరుకుని రెండు రోజులు ఏకంగా ప్రగతి భవన్ లోనే బస చేసి కెసీఆర్ తో చర్చలు జరపాల్సిన అవసరం ఏమి వచ్చింది అన్న చర్చ కూడా సాగుతోంది. టీఆర్ఎస్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం టీఆర్ఎస్ కు పీకె కంపెనీ ఐ ప్యాక్ పనిచేయటం పక్కా. అంటే పీకె కాంగ్రెస్ లో చేరినా వ్యాపారం వ్యాపారమే..రాజకీయం రాజకీయమే అన్నమాట. ఇందులో మునిగేది ఎవరో తేలేది ఎవరో తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకూ ఆగాల్సిందే.