Telugu Gateway
Politics

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఎనిమిది దశల్లో

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఎనిమిది దశల్లో
X

దేశంలో మరో మినీ ఎన్నికల సంగ్రామానికి రంగం సిద్ధం అయింది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికలు మాత్రం ఎనిమిది దశల్లో జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా షెడ్యూల్ ప్రకటించారు. ఆయన అస్సోం, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను శుక్రవారం వెల్లడించారు. కేరళ లో 140, అస్సోంలో 126, తమిళనాడులో 234, పశ్చిమబెంగాల్‌ లో 294, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఏప్రిల్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు మే 2వ తేదీన ప్రకటించనున్నారు. అయితే తొలిసారి ఆన్ లైన్ లో నామినేషన్ కు అవకాశం కల్పించారు. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి .

పశ్చిమ బెంగాల్

294 స్థానాలతో అతిపెద్ద అసెంబ్లీగా ఉన్న పశ్చిమబెంగాల్‌లో మొత్తం 8 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 27, ఏప్రిల్‌ 1, 6, 10, 17, 22, 26, 29 పోలింగ్ చేపట్టనున్నారు. 8 విడతల్లో జరిగే ఈ ఎన్నికలకు లక్షకు పైగా పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

తమిళనాడు

234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 6వ తేదీన పోలింగ్‌. 89 వేల పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

కేరళ

140 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ ఏప్రిల్ 6వ తేదీన ఎన్నిక. 40 వేల పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ చేపట్టనున్నారు.

అసోం

మూడు విడతల్లో 126 స్థానాలకు ఎన్నికలు. మార్చి 27వ తేదీన తొలి విడత పోలింగ్‌ (47 అసెంబ్లీ స్థానాలు). ఏప్రిల్‌ 1, 6వ తేదీల్లో రెండు, మూడో విడతలకు ఎన్నికలు. 33 వేల పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు.

పుదుచ్చేరి

30 స్థానాలు ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఒకే విడతలో పోలింగ్‌ జరగనుంది. ఏప్రిల్‌ 6వ తేదీన పోలింగ్‌. 1,500 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు.

Next Story
Share it