ప్రియాంక గాంధీతో ఫోటోలు..చిక్కుల్లో యూపీ పోలీసులు!
సమస్యలు ఎప్పుడు ఏ రూపంలో వస్తాయో ఊహించటం కష్టం. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లోని ఆ పోలీసులకు అలాంటి సమస్యలే ఎదురయ్యాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో ఓ వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించేంందుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వెళ్లారు. అయితే ఆమెను అడ్డుకున్న పోలీసులు అక్కడ నుంచి పంపారు. ఆ సంఘటన తర్వాత కొంత మంది మహిళా పోలీసులు ప్రియాంకగాంధీతో కలసి ఫోటోలు దిగారు. అదే ఇప్పుడు వారికి సమస్యలు తెచ్చిపెడుతోంది. ఇలా ఫోటోలు దిగటం ద్వారా వారు ఏమైనా సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారా అనే అంశంపై విచారణ జరిపిస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
దీనిపై ప్రియాంక స్పందించారు. తనతో ఫోటో దిగటం కూడా నేరమేనా? అని ప్రశ్నించారు. వారిపై చర్యలు తీసుకుంటే తనపైనా తీసుకోవాలన్నారు. తనతో కొంత మంది పోలీసు సిబ్బంది ఫోటోలు దిగటంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ బాధపడినట్లు వార్తలు వస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. కష్టపడి పనిచేసే నిబద్ధత గల మహిళా పోలీసుల కెరీర్ ను దెబ్బతీయాలనుకోవటం సరికాదని సూచించారు. మరి ప్రభుత్వం ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే. ప్రియాంక ట్వీట్ తో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.