Telugu Gateway
Politics

అన్నదానానికి వెళుతున్న రేవంత్ ను అడ్డుకున్న పోలీసులు

అన్నదానానికి వెళుతున్న రేవంత్ ను అడ్డుకున్న పోలీసులు
X

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి గాంధీ ఆస్పత్రి దగ్గర ప్రతి రోజూ వెయ్యి మందికి అన్నదానం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఆయన ఆదివారం నాడు గాంధీ ఆసుపత్రి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద పేదలకు అన్నదానం చేసేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో ఎంపీ రేవంత్ రెడ్డిని బేగంపేటలో పోలీసులు అడ్డుకున్నారు. లాక్ డౌన్ సమయంలో అనుమతి ఉన్న జాబితాలో ఎంపీలు లేరని పోలీసులు వాదించారు. ఉదయం పది గంటల లోపే ఎవరికైనా అనుమతి ఉంటుందని తెలిపారు. అయితే భోజనం మధ్యాహ్నం చేస్తారా..పొద్దున చేస్తారా అంటూ రేవంత్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అసలు ఈ ప్రభుత్వానికి ఏమైనా సోయి ఉందా అంటూ ప్రశ్నించారు. కేటీఆర్ నుంచి ఆదేశాలు ఉన్నాయి... మిమ్మల్ని అనుమతించలేమని పోలీసులు చెబుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

బేగంపేటలో రేవంత్ రెడ్డి వాహనం ముందుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయితే తనను ఆపేందుకు ఉన్న రాతపూర్వక ఆదేశాలు చూపాలని ఎంపీ డిమాండ్ చేశారు. పేదవాడి ఆకలిపై రాజకీయాలు చేస్తారా... అంటూ మండిపడ్డారు. లాక్ డౌన్ టైంలో పేదలకు పట్టెడు అన్నం పెట్టడం నేరమా అని ప్రశ్నించారు. 'నేను స్థానిక ఎంపీని, నన్ను అడ్డుకోమని చెప్పే అధికారం ఎవరిచ్చారు. గరీబోడి నోటికాడి కూడు లాగేసే ప్రయత్నం ఏమిటి . సామాజిక సేవలోనూ రాజకీయాలు వెతికే ప్రయత్నం దుర్మార్గం. ఇంత సిగ్గుమాలిన రాజకీయాలు అవసరమా' అంటూ పోలీసుల తీరుపై మండిపడ్డారు.

Next Story
Share it