గులాంనబీ ఆజాద్ కు మోడీ సెల్యూట్
రాజ్యసభలో మంగళవారం నాడు అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ ఓ సారి కంట నీరు పెట్టుకోవటంతోపాటు... రాజ్యసభలో ఏకంగా కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ప్రతి పక్ష నాయకుడు, గులాంనబీ ఆజాద్ కు సెల్యూట్ చేశారు. ఇంతకు ముందు కూడా అజాద్ పై రాజ్యసభలో ప్రధాని మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. గులాం నబీ తనకు నిజమైన స్నేహితుడని అభివర్ణించిన ప్రధాని, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఉన్నత పదవులు వస్తాయి... పోతాయి కానీ ఆయన స్పందించిన తీరు తలుచుకుంటే కన్నీళ్లు ఆగవంటూ ఆజాద్‌కు సెల్యూట్ చేశారు ఆజాద్ తన సొంత పార్టీ గురించి మాత్రమే కాకుండా దేశం, సభ గురించి కూడా ఆందోళన చెందేవారన్నారు. 2007లో కాశ్మీర్ ఉగ్రదాడి సమయంలో గుజరాతీ పర్యాటకులు చిక్కుకున్నారని, ఆ సమయంలో ఆయన చేసిన మేలును మరిచిపోలేనని మోదీ వ్యాఖ్యానించారు. అనుక్షణం గుజరాతీ పర్యాటకులను యోగ క్షేమాలపై తనకు అప్‌డేట్ ఇచ్చారంాటూ కన్నీరు పెట్టుకున్నారు.
ఆ సమయంలో దివంగత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రయత్నాలను కూడా తాను ఎప్పటికీ మరచిపోలేనన్నారు. 'మీ పదవీ విరమణను అంగీకరించను. మీ సలహాలు తీసుకుంటూనే ఉంటాను. మా తలుపులు మీ కోసం ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయి' అని ఈ ఫిబ్రవరి 15 తో రాజ్యసభ పదవీకాలం ముగియనున్న ఆజాద్ నుద్దేశించి మోదీ అన్నారు. గులాం నబీ జీ ఎప్పుడూ మర్యాదగా మాట్లాడతారు. ఎప్పుడూ అసభ్యకరమైన భాషను ఉపయోగించరు. ఈ విషయంలో ఆయన్నుంచి నేర్చుకోవాలన్నారు. అలాగే కాశ్మీర్ ఎన్నికలను ఆజాద్ స్వాగతించారంటూనే కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు.ఆజాద్ స్పందిస్తూ పార్టీ పరంగా విభేదాలున్నా..పలు విషయాలపై ఇరువురం పరస్పరం వాదించుకున్నా, విమర్శించుకున్నా, వ్యక్తిగత సంబంధాలను దెబ్బతీయలేదని వ్యాఖ్యానించారు. పండుగల సందర్భంగా తప్పనిసరిగా పలకరించే వారిలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మోదీ ఉంటారని గుర్తు చేసుకున్నారు.